Share News

బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థిపై అధికారుల అమానుషం!

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:40 AM

బాసర ట్రిపుల్‌ ఐటీ.. రాజీవ్‌ గాంధీ వైజ్ఞానానికి సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) అధికారులపై ఓ విద్యార్థి తీవ్ర ఆరోపణలు చేశాడు.

బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థిపై అధికారుల అమానుషం!

  • మార్కుల్లో తేడాపై ప్రశ్నిస్తే నిర్బంధించారని..

  • ఫోన్‌ లాక్కోని, వేధింపులకు గురి చేశారని ఓ విద్యార్థి ఆరోపణ

  • మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

బాసర, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): బాసర ట్రిపుల్‌ ఐటీ.. రాజీవ్‌ గాంధీ వైజ్ఞానానికి సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) అధికారులపై ఓ విద్యార్థి తీవ్ర ఆరోపణలు చేశాడు. పరీక్షల మూల్యాంకనంలో జరిగిన అన్యాయంపై వివరణ కోరినందుకు తనను ఓ గదిలో నిర్బంధించారని, సెల్‌ఫోన్‌ లాక్కోని వేధింపులకు గురి చేశారని పేర్కొన్నాడు. గతేడాది నవంబరులో తనకు జరిగిన ఈ అవమానంపై యవన్నగారి మనీష్‌ రెడ్డి అనే విద్యార్థి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. మనీష్‌ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. సమాధాన పత్రాల మూల్యాంకనంలో పారదర్శకత లేదని, తనకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని మనీష్‌ రెడ్డి కొంతకాలంగా యూనివర్సిటీ అధికారులను కోరుతున్నాడు. ఈక్రమంలో గత నవంబరు 26న మనీ్‌షను యూనివర్సిటీకి పిలిపించిన అధికారులు.. సుమారు 10 మంది అధ్యాపకుల సమక్షంలో మనీష్‌ సెల్‌ఫోన్‌ లాక్కోని అతడిని ఓ గదిలో బంధించారు. మనీష్‌ ఏడుస్తున్నా పట్టించుకోకపోగా.. మనీష్‌ తల్లిదండ్రులను దూషించారు. అంతేకాక అకడమిక్‌ ప్రమోషన్‌ కావాలంటే తాము చెప్పిన మాట వినాలని బెదిరించారు. యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ 16 పేజీల లేఖ రాయాలని మనీ్‌షను బలవంతం చేశారు. ఇక, మరుసటి రోజు ఉదయం మనీ్‌షను పంపించేటప్పుడు వర్సిటీకి చెందిన ఓ సెక్యూరిటీ గార్డును సాధారణ దుస్తుల్లో వెంట పంపారు. మనీ్‌షతోపాటు సుమారు 200 కిమీల దూరం ప్రయాణించిన ఆ గార్డు.. మనీ్‌షకు సెల్‌ఫోన్‌ ఇవ్వలేదు. పైగా, వచ్చిన ఫోన్‌ కాల్స్‌ను స్పీకర్‌ మోడ్‌లో పెట్టి విన్నాడు. ఈ అక్రమ నిర్బంధం, నిఘాపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మనీష్‌ మానవ హక్కుల సంఘాన్ని కోరగా.. కమిషన్‌ కేసు నమోదు చేసింది. కాగా, ఈ విషయమై వీసీ గోవర్ధన్‌ను వివరణ కోరగా.. ఎప్పుడో జరిగిన పాత విషయాలను కొందరు విద్యార్థులు ఉద్దేశ్యపూర్వకంగా ఇప్పుడు బయటకు తీస్తున్నారని తెలిపారు. మనీష్‌ రెడ్డి అనే విద్యార్థి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడామని, ఆ సమస్యను అప్పుడే పరిష్కరించామని వివరించారు.

Updated Date - Feb 28 , 2026 | 03:40 AM