Share News

బాసర ట్రిపుల్‌ ఐటీలో జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల కమిటీ విచారణ

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:43 AM

బాసర ట్రిపుల్‌ ఐటీ(ఆర్జీయూకేటీ)లో కొంతకాలంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

బాసర ట్రిపుల్‌ ఐటీలో జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల కమిటీ విచారణ

  • క్యాంప్‌సలో సమస్యలపై ఆరా

  • ల్యాబ్‌లు, హాస్టల్‌ భవనాల పరిశీలన

  • విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నుంచి వివరాల సేకరణ

  • రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక?

బాసర/హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): బాసర ట్రిపుల్‌ ఐటీ(ఆర్జీయూకేటీ)లో కొంతకాలంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. క్యాంప్‌సలో అసలు ఏం జరుగుతోంది.. విద్యార్థుల సమస్యలకు మూలకారణాలేంటి.. అన్న అంశాలపై స్పష్టత కోసం జేఎన్‌టీయూ చెందిన 9మంది ప్రొఫెసర్లతో కమిటీ వేసింది. జేఎన్‌టీయూహెచ్‌ రెక్టార్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ బుధవారం బాసర ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టింది. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడటంతో పాటు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా అడిగి తెలుసుకుంది. బోధనేతర సిబ్బందితోనూ ప్రత్యేకంగా మాట్లాడింది. క్యాంప్‌సలో ల్యాబ్‌లు, హాస్టల్‌ భవనాలు, మెస్‌ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులను కమిటీ పరిశీలించింది. అధ్యాపకులు తమకు ఎదురవుతున్న వృత్తిపరమైన సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురాగా, విద్యార్థి సంఘాల నాయకులు క్యాంప్‌సలో నెలకొన్న దీనస్థితిని వివరిస్తూ వినతి పత్రాలను అందజేశారు. క్యాంప్‌సలోని పలు విభాగాల్లో నెలకొన్న సమస్యలపై ఈ కమిటీ రెండు రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిసింది. బాసర ట్రిపుల్‌ ఐటీకి మెంటార్‌షిప్‌ బాధ్యతలను ప్రభుత్వం జేఎన్‌టీయూకు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ట్రిపుల్‌ ఐటీలో అకడమిక్‌ అంశాల కంటే ఆర్థికపరమైన సమస్యలే అధికంగా ఉన్నట్లు కమిటీ సభ్యులు భావించినట్లు తెలిసింది. విద్యార్థుల సంఖ్య 9వేలకు పైబడి ఉండడం, వారికి అవసరమైన ఖర్చులు సకాలంలో అందకపోవడం, విద్యాబోధనకు అర్హులైన సీనియర్‌/రెగ్యులర్‌ ప్రొఫెసర్లు లేకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులకు, గెస్ట్‌ ఫ్యాకల్టీకి అరకొర వేతనాలే ఇస్తుండడం పెద్ద సమస్యగా మారింది. ఇక, బాసర ట్రిపుల్‌ ఐటీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా రెగ్యులర్‌ వీసీని నియమించలేదు. రెగ్యులర్‌ వీసీ లేకపోవడంతోనే ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు కొండలా పేరుకుపోయాయని ఉద్యోగులు చెబుతున్నారు.

Updated Date - Apr 30 , 2026 | 04:43 AM