బాసరకు రూ.225 కోట్లు
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:43 AM
బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.225 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలయ అభివృద్ధి పనుల కోసం మంజూరు
రేపు సీఎం చేతుల మీదుగా భూమిపూజ
రాష్ట్రంలోని ఆలయాల పరిసరాల్లో..ఇకపై తిరుమల తరహా నిబంధనలు
రాజకీయ పార్టీల సభలు, ప్రదర్శనలు, జెండాలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట
ఎంతటి వీఐపీలైనా ఆలయ ప్రాంగణంలోకి వాహనాలకు నో ఎంట్రీ: సీఎం రేవంత్‌రెడ్డి
ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.225 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ అభివృద్ధి పనులకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా భూమిపూజ నిర్వహించనున్నారు. పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న బాసర అమ్మవారి క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. నిత్యం అక్షరాభ్యాసాలతో ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. వసంత పంచమి, తదితర పవిత్ర రోజుల్లో ఇంకా ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా దర్శనానికి తరలివస్తారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. అయితే ప్రస్తుతమున్న దేవాలయ ప్రాంగణం ఇరుకుగా ఉండటమే కాకుండా క్యూ కాంప్లెక్స్ సౌకర్యం లేకపోవడంతో భక్తులకు ఇబ్బందికరంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించింది. సీఎం రేవంత్‌రెడ్డి శృంగేరి పీఠాధిపతుల ఆశీర్వాదం, అనుమతి తీసుకుని ఆలయ పునరుద్ధరణ పనులకు రూ.225 కోట్లు మంజూరు చేశారు.
ఆలయాల ప్రాంగణాల్లో ఆధ్యాత్మికతకు పెద్దపీట..
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని సూచించారు. శనివారం బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిని పరిశీలించిన సీఎం.. పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్ర్తాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలన్నారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్‌లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలు నాటాలని సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని, పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి భక్తులకు సేవలందించాలని అన్నారు. ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణం బయటే నిలిచిపోవాలని, ప్రాంగణంలోకి కేవలం విద్యుత్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడితే సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు.