బాసర ఆలయ పునర్నిర్మాణానికి రూ.225 కోట్లతో శ్రీకారం
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:00 AM
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకుని..
అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
కుటుంబ సమేతంగా ఆలయ సందర్శన
నిర్మల్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువుల తల్లి సన్నిధిలో వేద మంత్రోచ్చారణల మధ్య సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన మనవడు రియాన్ష్‌కు అక్షరాభ్యాసం చేయించి ఓనమాలు దిద్దించారు. అనంతరం రూ.225 కోట్లతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులకు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. తద్వారా, బాసర క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అంకురార్పణ చేశారు. దాదాపు గంటకుపైగా వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. భక్తుల సౌకర్యార్థం ఆలయ విస్తరణ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు, ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాగా, మరో హెలికాప్టర్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు వచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయమంతా వివిధ రకాల పుష్పాలు, మామిడి తోరణాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. పోలీసులు పలు అంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే రాజకీయ నాయకుల హడావిడి ఉంటుంది. కానీ, సోమవారం అందుకు భిన్నంగా సాగింది. అగ్ర నేతలు తప్ప ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఆలయంలో పర్యటన తర్వాత సీఎం బృందం ఆదిలాబాద్ జిల్లాలో కార్యక్రమానికి బయలుదేరి వెళ్లింది. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ జి.నగేశ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నారాయణ రావు పటేల్ తదితరులున్నారు.