బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:18 AM
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న అస్మితా బేగం హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
హాస్టల్ భవనంపైనుంచి దూకడంతో గాయాలు
ముథోల్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న అస్మితా బేగం హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నడుముకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను తొలుత నిజామాబాద్ ఆసుపత్రికి, అక్కడనుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అస్మితా బుధవారం ఎవరితోనూ మాట్లాడకుండా ఆందోళనగా కనిపించినట్లు స్నేహితులు తెలిపారు. హాస్టల్‌కు వెళుతున్నానని చెప్పి తొలుత ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిందని, ఆ తర్వాత అదే బ్లాక్ మొదటి అంతస్తు పైనుంచి కిందకు దూకిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలోని మానూరు మండలం రాయిపల్లి నుంచి బాలిక తల్లి, మేనమామ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ట్రిపుల్ ఐటీ సిబ్బంది వారిని ఎవరితోనూ మాట్లాడనీయలేదు. మరోవైపు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని, ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.