బాసర ట్రిపుల్ ఐటీలో మొబైల్ ఫోన్లపై కట్టడి
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:12 AM
విద్యార్థుల్లో ఏకాగ్రత, క్యాంప్‌సలో క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యంగా బాసర ట్రిపుల్ ఐటీ కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యార్థుల ఏకాగ్రత కోసమే: యాజమాన్యం
ముథోల్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో ఏకాగ్రత, క్యాంప్‌సలో క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యంగా బాసర ట్రిపుల్ ఐటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తరగతి గదులు, పరీక్షా కేంద్రాలు, లైబ్రరీలు, భోజన శాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ యాజమాన్యం ఆదివారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థులు మొబైల్ ఫోన్లను అధికంగా వినియోగించడం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గుతోందని, వారిలో పరధ్యానం పెరుగుతోందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ ఫ్లాట్‌ఫాంలు దుర్వినియోగం అవుతున్నాయనే కారణంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. అధికారులు, అధ్యాపకులు, వార్డెన్లు, గ్రంథాలయ సిబ్బంది అంతా కలిసి ఈ నిబంధనలను క్యాంప్‌సలో కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో క్రమశిక్షణ పాటించడం అనేది విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసర మని ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంక్షేమ అధికారి మధుసూదన్‌రెడ్డి సూచించారు.