న్యాయవాదుల సంక్షేమం విషయాన్ని మాకు అప్పగించండి
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:46 AM
న్యాయవాదుల సంక్షేమం, రక్షణ వేర్వేరు అంశాలని.. సంక్షేమం విషయాన్ని తెలంగాణ బార్ కౌన్సిల్‌కు అప్పగించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి, సభ్యుడు కొల్లి సత్యనారాయణ కోరారు.
అడ్వకేట్ జనరల్ నేతృత్వంలో వెల్ఫేర్ ట్రస్టు ఏర్పాటుపై బార్ కౌన్సిల్ అభ్యంతరం
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను స్వాగతిస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల సంక్షేమం, రక్షణ వేర్వేరు అంశాలని.. సంక్షేమం విషయాన్ని తెలంగాణ బార్ కౌన్సిల్‌కు అప్పగించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి, సభ్యుడు కొల్లి సత్యనారాయణ కోరారు. గురువారం హైకోర్టులోని బార్ కౌన్సిల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర మంత్రిమండలి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఆమోదించడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే ఇప్పటికే అమల్లో ఉన్న తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్‌కు సమాంతరంగా అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేయడం వల్ల రెండు వేర్వేరు చట్టబద్ధమైన వ్యవస్థలు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్ నేతృత్వంలోని అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్టు వద్ద ఉన్న రూ. 100 కోట్ల నిధిని బార్ కౌన్సిల్‌కు అప్పగించాలన్నారు. వెల్ఫేర్ ట్రస్టును చట్టంలో చేర్చడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. మరోవైపు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో న్యాయవాద వృత్తిదారులు స్వేచ్ఛగా కక్షీదారుల పక్షాన పోరాడేందుకు అనుకూలంగా సెక్షన్లు ఉన్నాయని కొనియాడారు. ఇందుకు న్యాయశాఖ మంత్రి కూడా అయిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే రక్షణ చట్టాన్ని దుర్వినియోగం చేసే న్యాయవాదులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష లేదా రూ.25 వేల జరిమానా లేదా రెండూ విధించేలా నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని.. వాటి తీవ్రత తగ్గించాలన్నారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..
తెలంగాణ న్యాయవాదుల రక్షణకు చట్టం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి గురువారం హైకోర్టు వద్ద పాలాభిషేకం చేశారు. న్యాయవాదులు మానవతారాయ్, సుంకర వంశీకృష్ణ, ఎస్‌ఎస్ రావు, టీవీ రమేష్, పంబాల వేణు, రాజు, శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.