Share News

ఆ స్థలం నాది.. కాదు, నాది..!

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:43 AM

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ స్థల వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఏపీలోని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, మరో వర్గం వారి మధ్య ఘర్షణ జరిగింది.

ఆ స్థలం నాది.. కాదు, నాది..!

  • బంజారాహిల్స్‌లో స్థలంపై ఎంపీ సీఎం రమేశ్‌, మరో వ్యక్తి మధ్య కొంతకాలంగా వివాదం

  • అనుచరులతో హడావుడి చేసిన సీఎం రమేశ్‌

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరువర్గాలు

బంజారాహిల్స్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ స్థల వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఏపీలోని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, మరో వర్గం వారి మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 2, అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆనంద్‌ ప్రభాత్‌ సొసైటీలో కొంత స్థలంపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఎంపీ సీఎం రమేశ్‌ మూడేళ్ల కిత్రం స్థలం చుట్టూ రేకులతో ప్రహరీ ఏర్పాటు చేశారు. ఇటీవల ఆ స్థలంలో నిర్మాణాలు చేసేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా, ఆ స్థలంలో సుమారు 2000 గజాలు తనదేనంటూ శివనారాయణ అనే వ్యక్తి వాదిస్తున్నారు. ఇటీవల కోర్టు నుంచి ఇంజెక్షన్‌ ఆర్డర్‌ కూడా తెచ్చుకున్నారు. ఆదివారం ఉదయం శివనారాయణ తన మనుషులతో సీఎం రమేశ్‌ వేసిన రేకులను తొలగించి తన స్థలంలో కంటెయినర్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సీఎం రమేశ్‌ తన అనుచరులతో కలిసి అక్కడి వచ్చి హల్‌చల్‌ చేశారు. తాను పెట్టించిన రేకులను ఎలా తీస్తారంటూ ప్రశ్నించారు. ఈ తరుణంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇరు వర్గాల వారు పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. శివనారాయణ, అతని మనుషులు తాము వేసిన రేకులను అక్రమంగా తొలగించి స్థలం ఆక్రమణకు పాల్పడ్డారని సీఎం రమేశ్‌ తరఫున సూపర్‌వైజర్‌ నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇదిలా ఉండగా తమకు కోర్టు ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వడంతో కంటెయినర్‌ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా సీఎం రమేశ్‌, అతని అనుచరులు, బీజేపీ నేత లంకల దీపక్‌రెడ్డి, లగడపాటి రాజగోపాల్‌, కొమురయ్య మనుషులు వచ్చి దౌర్జన్యం చేయడంతో పాటు దాడి చేశారని శివనారాయణ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం శివనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. 2006లో తాను ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి సీఎం రమేశ్‌ దీన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేయగా తాను కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తమ స్థలం కాపాడాలని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Updated Date - Mar 23 , 2026 | 05:44 AM