Minister Ponguleti: అక్కడ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం కడితే ఒప్పుకోం
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:01 AM
బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సమీకృత రిజిస్ర్టేషన్ భవనం కట్టేందుకు అధికారులు ప్రతిపాదించారు.
యాజమాన్య హక్కులు ఉన్నాయంటూ కొందరు అభ్యంతరం
వారికే మద్దతు తెలిపిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
బంజారాహిల్స్‌లో భూమి పూజను విరమించుకున్న మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జనవరి 8(ఆంధ్ర జ్యోతి): బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సమీకృత రిజిస్ర్టేషన్ భవనం కట్టేందుకు అధికారులు ప్రతిపాదించారు. 2ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ఈ భవనానికి 7న భూమిపూజ చేసేందుకు రిజిస్ర్టేషన్‌శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఆహ్వానపత్రాలను కూడా ముద్రించారు. 6వ తేదీ రాత్రి శిలాఫలకం నిర్మాణం కోసం ఇటుకలు తరలించారు. ఇది గ్రహించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అది ప్రభుత్వ భూమి కాదన్నారు. దీంతో రిజిస్ర్టేషన్‌శాఖ అధికారులు నిర్మాణసామాగ్రిని వెనక్కి తీసుకెళ్లారు. 2ఎకరాలకు సంబంధించి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని, న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగా ప్రభుత్వ భవననిర్మాణం ఎలా చేస్తారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ కూడా వారికే మద్దతు తెలిపారు. దీంతో మంత్రి పొంగులేటి భూమిపూజను విరమించుకున్నారు.