రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పించండి
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:13 AM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. నేటికీ ఆరు గ్యారంటీలను నెరవేర్చలేక పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రారచందర్‌రావు విమర్శించారు.
6గ్యారంటీలు ఎప్పుడు నెరవేరుస్తారని అడగాలి
సీఎం రేవంత్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు బహిరంగ లేఖ
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. నేటికీ ఆరు గ్యారంటీలను నెరవేర్చలేక పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రారచందర్‌రావు విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి హామీల అమలులో వైఫల్యాన్ని వివరిస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు.. అపాయింట్‌మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్‌ను రారచందర్‌రావు కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగ విలువలు, హామీల అమలుపై పదేపదే పేర్కొనే రాహుల్‌కు తెలంగాణ ప్రజల మనోభావాలను వివరించాల్సి ఉందన్నారు. విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్న రాహుల్ వారికిచ్చిన హామీలను మరచిపోయి ఉంటారని రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ అగ్రనాయకత్వం వద్ద ‘ప్రత్యేక స్థానం’ ఉందని.. ఆయన రాహుల్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పించగలరనే విశ్వాసం తనకు ఉందన్నారు. తన లేఖకు స్పందించకపోయినా, రాహుల్ అపాయింట్‌మెంట్ ఇప్పించకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహమే అవుతుంద న్నారు. ‘గత ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రచారం చేసిన సోనియా, రాహుల్, ప్రియాంక వ్యక్తిగతంగా ఇచ్చిన హామీ మేరకే ప్రజలు కాంగ్రె్‌సకు ఓటేశారు. మహిళలకు ప్రతినెలా రూ.2,500 సాయం నేటికీ అందలేదు. ఎకరాకు రూ.15వేల రైతు భరోసా, క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లింపు, మద్దతు ధరకు పంటల కొనుగోలులో కాంగ్రెస్ విఫలమైంది. విద్యాభరోసా కింద రూ.5లక్షల సాయం, నిరుద్యోగులకు రూ.4వేల భృతి, వృద్ధులకు రూ.4వేల పింఛన్ ఇప్పటికీ అందలేదు. ఈ నేపథ్యంలో ఈఅంశాలను మీ పార్టీ అగ్రనేత రాహుల్‌కు గుర్తుచేస్తాం. ఆయనతో జరిగే భేటీలో మీరు కూడా పాల్గొన్నా అభ్యంతరం లేదు’అని లేఖలో రాంచందర్‌రావు వివరించారు.