ప్రజా తీర్పుపై కుట్రలు చేస్తే రోడ్లపై తిరగనివ్వం
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:40 AM
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను రోడ్లపై తిరగనీయబోమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులకు
కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక
కరీంనగర్ మేయర్ పదవి తమదేనని ధీమా
ఈ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు అంకితం ఇస్తున్నామని ఎద్దేవా
హైదరాబాద్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను రోడ్లపై తిరగనీయబోమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘కరీంనగర్ ప్రజలు ప్రేమ, అభిమానంతో మాకు ఓటేశారు. బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వాళ్లు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్ధం ప్రారంభిస్తాం. బీజేపీ కార్యకర్తల దమ్మేంటో.. కరీంనగర్ ప్రజల ఐక్యత ఏంటో మీకు తెలియదు.. అదే ప్రజలను రోడ్డుపైకి తీసుకొస్తాం.. మీ సంగతి చూస్తాం.. మీ బతుకులు బర్‌బాత్ చేస్తాం.. మిమ్మల్ని రాజకీయ సమాధి చేస్తామ’ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌లో బీజేపీ విజయం సాధించడాన్ని దేశమంతా చూసిందంటూ, తాము చేసే యుద్ధాన్ని కూడా దేశమంతా చూసేలా చేస్తామన్నారు. బీజేపీ అభ్యర్థి మేయర్ కాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఆ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేయర్ పదవి బీజేపీదేనని అన్నారు. బీఆర్‌ఎస్ తమకు మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ కార్పొరేటర్లు చెబుతున్నారని, మీరిద్దరూ (కాంగ్రెస్, బీఆర్‌ఎస్) కొట్లాడుకోవద్దు.. మేయర్ పదవి తమకు ఇవ్వాలని ఎంఐఎం కోరుతోందని చెప్పారు. ఆ మూడు పార్టీలూ కలిసినా 26 సీట్లు మాత్రమే వస్తే... మేయర్ పదవిని ఎలా సాధిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో బీజేపీ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు అంకితమని సంజయ్ ఎద్దేవా చేశారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 13 సీట్లే వస్తాయని రాష్ట్ర ఇంటలిజెన్సు సీఎంకు నివేదిక ఇచ్చిందట. మేయర్ పదవి కోసం గుంటనక్కలన్నీ ఒక్కటయ్యాయి. బీజేపీ సింహం.. సింగిల్ గానే పోటీచేస్తుంద’ని సంజయ్ మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు. ఆ రెండు పార్టీలతో ఎంఐఎం అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. కాంగ్రె్‌సతో సంసారం చేస్తూ బీఆర్‌ఎస్‌కు కన్ను కొడుతోంద’న్నారు.
కరీంనగర్‌పై కమలం పట్టు
కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ పట్టు సాధించింది శనివారం హైదరాబాద్ శివారులోని ఒక రిసార్టులో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత, 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేశ్‌కు సంజయ్ కాషాయ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఒక ఇండిపెండెంట్, మరో ఏఐఎ్‌ఫబీ కార్పొరేటర్ సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరి చేరికతో బీజేపీ బలం 34కు చేరింది.