తుమ్మలకు కనీస అవగాహన లేదు
ABN , Publish Date - May 04 , 2026 | 04:06 AM
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతు సమస్యలు, కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలపై కనీస అవగాహన కల్పించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చురకలంటించారు. ‘
వ్యవసాయ మంత్రికి మీ మేనిఫెస్టో గురించి వివరించండి.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ మరో లేఖ
రైతుల పక్షాన నిలబడితే ఎదురుదాడి చేస్తారా?.. అంటూ తుమ్మలపై ధ్వజం
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతు సమస్యలు, కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలపై కనీస అవగాహన కల్పించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చురకలంటించారు. ‘రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరితే ఎదురుదాడి చేస్తారా?.’ అంటూ మంత్రి తుమ్మలపై మండిపడ్డారు. ‘‘నరంలేని నాలుక ఏది మాట్లాడినా చెల్లుతుంది’’ అన్నట్లుగా మంత్రి వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు వడ్ల కొనుగోలులో విపక్షాలపై రాజకీయాలను పక్కనబెట్టి రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆదివారం సీఎం రేవంత్‌కు ఆయన మరో బహిరంగ లేఖ రాశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 1న తాను బహిరంగ లేఖ రాస్తే, సమస్యలను పరిష్కరించాల్సి పోయి తమ కేబినెట్ సహచరుడు మంత్రి తుమ్మల తనపై ఎదురుదాడికి దిగుతూ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ ఆక్షేపించారు. ఆ లేఖలోని అంశాలు వ్యవసాయ మంత్రి అవగాహనారాహిత్యానికి నిదర్శనంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ‘‘కళ్లుండీ.. చూడలేని కబోధి తుమ్మల. అబద్ధాలు, అవగాహనారాహిత్యంలో ఆయన ఆస్కార్‌కు అర్హులు. రాష్ట్రంలో ఎరువులు కూడా సక్రమంగా పంపిణీ చేయలేని అసమర్థుడు. వ్యవసాయ మంత్రిగా కొనసాగే అర్హత ఆయనకు లేదు. మంత్రి ఖమ్మం గడప దాటి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న బాధలను కళ్లారా చూడాలి’’ అంటూ లేఖలో తీవ్రంగా విమర్శించారు.
బీమా లేదు.. పరిహారం లేదు
రాష్ట్రంలో ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. ఈ పథకం పనికిరానిదైతే రెండున్నరేళ్లు కావొస్తున్నా ప్రత్నామ్నాయ పంటల బీమాపథకం ఎందుకు తీసుకురాలేకపోయారంటూ ప్రశ్నించారు.పౌరసరఫరాల సంస్థ సేకరించిన ధాన్యంలో సింహభాగం కేంద్రమే తీసుకుంటోందని, గత ఖరీఫ్ సీజన్ లో 71.86 లక్షల టన్నులకుగాను 60 లక్షల టన్నులు.. రబీలో 50.10 లక్షల టన్నులను కేంద్రం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పడం అవాస్తవమని, 12ఏళ్లలో రూ.12లక్షల కోట్లకుపైగా నిధులు కేంద్రం తెలంగాణకు వెచ్చించిందని స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకపోతేవడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ చేసిన రైతు చట్టాలను నల్ల చట్టాలంటూ వ్యవసాయ మంత్రి చెప్పడం రాజ్యాంగ ద్రోహమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అన్నదాతలు పడుతున్న బాధలు తెలుసుకోవాలని సూచించారు.