రేవంత్‌రెడ్డి.. అభినవ గోబెల్స్!
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:21 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు, మోసాలను నమ్ముకొని పాలన సాగిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన ‘అభినవ గోబెల్స్’ అని మండిపడ్డారు.
కేసీఆర్ తరహాలో అబద్ధాలతోనే పాలన.. విషప్రచారంతో మహిళా బిల్లును అడ్డుకున్నారు
దక్షిణాదికీ నష్టం చేశారు... మహిళలు రేవంత్‌ను గద్దె దించడం ఖాయం: బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు, మోసాలను నమ్ముకొని పాలన సాగిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన ‘అభినవ గోబెల్స్’ అని మండిపడ్డారు. అబద్ధాలు, మోసాలు చేసే వారినే ప్రజలు నమ్ముతారని బహిరంగంగా ప్రకటించిన రేవంత్.. ఆ అబద్ధాల పునాదులపైనే ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని, మహిళలకు ప్రతినెలా రూ.2500 చొప్పున చెల్లిస్తామని, తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారని ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం రేవంత్‌కు ఉన్నట్లుంది. మాజీ సీఎం కేసీఆర్ తరహాలోనే దొంగ హామీలు, పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెడుతూ పాలనను కొనసాగిస్తున్నారు. నిజాయతీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం ఆయనకు అలవాటుగా మారింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచి దక్షిణాదికి న్యాయం చేయాలని ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్ధితో బిల్లును ప్రవేశపెడితే ఇండి కూటమి నేతలు అడ్డుకున్నారు. ఈ విషయంలో విష ప్రచారంతో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం జరుగుతుందంటూ తప్పుడు ప్రచారంచేసి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగకుండా కుట్రలు చేశారు.
మోదీ ప్రభుత్వం దక్షిణాదికి మేలు చేయడానికి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా రేవంత్, స్టాలిన్ సహా ఇండి కూటమి నేతలు దక్షిణాదికి నష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుకుని ఏదో సాధించినట్లుగా సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ మహిళలతోపాటు దేశంలోని 70 కోట్ల మహిళలెవరూ ఇండి కూటమి చేసిన అవమానాన్ని మర్చిపోరు. అతి త్వరలోనే రేవంత్‌సహా కూటమి నేతలు మూల్యం చెల్లించుకోవడం ఖాయం. మహిళలంతా ఏకమై రేవంత్ సర్కారును గద్దె దించడం తథ్యం. కాంగ్రెస్ మోసాలను గ్రామాలకు తీసుకెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలోని నాయకత్వం సిద్ధమవుతోంది’అని వివరించారు.