Share News

మునిసిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డే

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:55 AM

రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మునిసిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఎద్దేవా చేశారు.

మునిసిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డే

  • కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మొద్దు: బండి సంజయ్‌

కరీంనగర్‌/హుజూరాబాద్‌/జమ్మికుంట/హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మునిసిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.500 కోట్ల నిధులు తీసుకువస్తానని హామీనిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించారని, దీంతో ప్రధాని వద్దకు వెళ్లి పంచాయతీలకు రూ.259 కోట్లు తెచ్చామని తెలిపారు. మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంతో పాటు ఆ జిల్లాలోని హుజూరాబాద్‌, జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలు, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ల్లో ఆయన మాట్లాడారు. బీజేపీని గెలిపిస్తే హుజూరాబాద్‌, జమ్మికుంట రూపు రేఖలు మారుస్తానని హామీనిచ్చారు. ఎవరు అడ్డొచ్చినా ఎన్నికలు అయిపోగానే హుజూరాబాద్‌ స్టేడియం నిర్మాణం పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటానన్నారు. హుజూరాబాద్‌ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధులతో జరిగిన పనులపై ముద్రించిన బుక్‌లెట్‌ను ఇంటింటికీ పంపుతానన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.19.57 కోట్లు, అమృత్‌ రూ.16.25 కోట్లు, స్వనిధి ద్వారా 4,377మందికి రూ.7.63 కోట్లు, పట్టణ మౌలిక సదుపాయాల (యూఐడీఎఫ్‌) ద్వారా రూ.36 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. బీజేపీకి మోసం చేయడం రాదని, దొంగ హామీలివ్వడం చేతకాదని.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల మోసపు మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని వ్యాఖ్యానించారు. మంచి పాలన కోసం ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వాలని కోరారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపిస్తే ఇంటి పన్ను, నల్లా పన్ను, వ్యాపార పన్నులు పెంచడం ఖాయమన్నారు. ఈ కాంగ్రెస్‌ సర్కారు రోడ్డు మీద నడిచే వారిపై కూడా ట్యాక్స్‌ వేసే పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో కరీంనగర్‌కు రూ.1,400 కోట్లు ఇచ్చానంటూ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని సంజయ్‌ మండిపడ్డారు.


సీఎంకు దమ్ముంటే ఆ నిధులు ఎప్పుడు ఇచ్చారు.. ఏయే అభివృద్ధి పనులకు ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతి కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్‌లను ఎందుకు అరెస్టు చేయడం లేదని కేంద్రాన్ని నిందించడం విచిత్రంగా ఉందన్నారు. కేసీఆర్‌ ఇచ్చే ఆ మూటలను అధిష్ఠానానికి పంపుతూ రేవంత్‌రెడ్డి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఆ విషయం ఆయన ఒప్పుకొంటే కేసీఆర్‌ సంగతి తామే చూసుకుంటామన్నారు. ‘జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి బండి సంజయ్‌ 7 రూపాయలైనా తెచ్చాడా అని అంటున్నాడు. నేను చేసిన అభివృద్ధి పనులు, తెచ్చిన నిధుల వివరాలు బుక్‌లెట్‌ ఆయన ఇంటికి, సచివాలయానికి పంపుతా.. చదువుకోవాలి. కరీంనగర్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి రూ.1,500 కోట్ల నిధులు తెచ్చా.. ఇవ్వాళ రేవంత్‌ వస్తే, ఎల్లుండి ఆయన అన్న అసదుద్దీన్‌ ఒవైసీ వస్తున్నాడు. ఇద్దరూ మాట్లాడుకునే వస్తున్నారు. దొంగ మాటలతో కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మి మోసపోవద్దు. అసలు కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేశారా..? మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం, 4 వేల పెన్షన్‌, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా..?’ అని ప్రశ్నించారు.

Updated Date - Feb 06 , 2026 | 03:57 AM