కోర్టు నిర్ణయాన్ని,చట్టాన్ని గౌరవిస్తాం
ABN , Publish Date - May 13 , 2026 | 03:51 AM
తాను, ఆ అమ్మాయి స్నేహితులమని, అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయామని, తాను ఏ తప్పూ చేయలేదని..... నా కొడుకు చెబుతున్నాడు.
ఏ తప్పూ చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు
ఆ విషయాన్ని నిరూపించుకోవాలని నేను చెప్పా
తప్పు చేసి ఉంటే నా కుమారుడైనా శిక్షించాల్సిందే
నా సమయాన్నంతా సమాజం కోసమే కేటాయించా
కుమారుడి కోసం ఆ సమయాన్ని ఇవ్వలేకపోయా
హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగం
కరీంనగర్, మే 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘తాను, ఆ అమ్మాయి స్నేహితులమని, అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయామని, తాను ఏ తప్పూ చేయలేదని..... నా కొడుకు చెబుతున్నాడు. అయినా.. నా కుమారుడిని నేను సమర్థించడం లేదు. చట్టాన్ని గౌరవిస్తా. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తా. చట్టం అందరికీ సమానమే. నా కుమారుడు నిజంగా తప్పు చేసినట్లు తేలితే శిక్ష విధించాల్సిందే’’ అని కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించిన హిందూ ఏక్తాయాత్రలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. తన కొడుకును క్రిమినల్‌గా చూపే ప్రయత్నం నడుస్తోందన్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదని, దాన్ని నిరూపించుకోవాలని తాను సూచించినట్లు చెప్పారు. తన సమయాన్నంతా సమాజానికే కేటాయించానని, తన కుమారుడికి సమయం ఇవ్వలేకపోయానన్నారు. బండి సంజయ్ ఏనాడూ భయపడే ప్రసక్తే లేదన్నారు. కాషాయ జెండా పట్టి కష్టాలు పడుతూనే ఉన్నానని, అయినా బాధ పడనని, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. తన చివరి శ్యాస వరకూ హిందూ ధర్మం కోసమే పని చేస్తానన్నారు. తన కుటుంబాన్ని, పార్టీని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సంఘటనతో తన భార్య తీవ్ర ఆవేదనకు లోనైందని, ఓ కన్నతల్లి ఆవేదన ఎలా ఉంటుందో తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. ఈ రోజు తన కుటుంబానికి నిప్పంటించారని, ఆ నిప్పుతోనే అవినీతి వ్యవస్థను దగ్ధం చేస్తానన్నారు. అవినీతి కుట్రలు చేసే గడీల బద్దలు కొడతానని హెచ్చరించారు. కరీంనగర్‌లో హిందువుల ఐక్యతను చాటేందుకు 16 ఏళ్లుగా హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని, జై శ్రీరాం నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుందన్నారు. హిందూ సమాజానికి ఆపద వస్తే జై శ్రీరాం నినాదంతో తెగించి కొట్లాడదామని పిలుపునిచ్చారు. కరీంనగర్ గడ్డ రక్తం తనలో ప్రవహిస్తుందని, కార్యకర్తలు, ప్రజలే తన కుటుంబమన్నారు. నాటి పాలకులు తనపై రాళ్ల దాడి చేసినా, 109 కేసులు పెట్టి జైలుకు పంపినా ఏనాడూ భయపడలేదన్నారు. హార్ట్‌లో స్టంట్ ఉన్నా హార్ట్‌ఫుల్‌గా 1600 కిలోమీటర్లు నడిచానని గుర్తు చేశారు.