జెన్ జీలను చూస్తుంటే ముచ్చటేస్తోంది
ABN , Publish Date - Aug 10 , 2026 | 06:00 AM
హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘రంజాన్ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు ఇచ్చింది.
హిందూ సమాజం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి
రంజాన్‌కు 33 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..
బోనాల పండగకు 20 కోట్లు విదిల్చింది
హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తా: సంజయ్
హైదరాబాద్/సైదాబాద్/చాంద్రాయణగుట్ట, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘రంజాన్ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు ఇచ్చింది. వారికి ఎందుకిచ్చారని నేను అడగడం లేదు. కానీ 80 శాతం ఉన్న హిందువుల పండుగకు కేవలం రూ.20 కోట్లు విదిలిస్తారా? హైదరాబాద్‌లో 3,400 ఆలయాలుంటే ఈ నిధులు ఏం సరిపోతాయ’ని మండిపడ్డారు. బోనాల ఉత్సవాలకు ఆలయాల్లో కనీస సౌకర్యాలు సమకూర్చలేదని, అభివృద్ధి గురించి తాము మాట్లాడితే మతం రంగు పులుముతారా అని ప్రశ్నించారు. జెన్ జీల తీరు చూస్తుంటే ముచ్చటేస్తోందని, హిందూ సమాజం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జెన్ జీలు ఆకాశంలోకి రాకెట్లను పంపడమే కాదు, హిందూ సనాతన ధర్మం కోసం కూడా మాట్లాడుతున్నారన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం సంజయ్.. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, భాగ్యలక్ష్మి, ఉప్పుగూడ మహంకాళి, సైదాబాద్ కుర్మగూడలోని నల్లపోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష మంది భక్తులు సందర్శించుకునే లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో బోనాల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.5.50 లక్షలు మంజూరు చేయడం దారుణమని విమర్శించారు. ఒవైసీ బాధ పడతారనే ఈ ఆలయానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. హిందూ ధర్మమంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు భయం పట్టుకుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని మోసపూరిత చరిత్ర కాంగ్రెస్‌ది అని ధ్వజమెత్తారు. ‘నేను గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే హేళన చేసిన కేటీఆర్ ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నారు. కేటీఆర్‌లాంటి మూర్ఖుడికి కూడా జ్ఞానోదయం కలిగించిన మహాశక్తి భాగ్యలక్ష్మి అమ్మవారు’ అని సంజయ్ వ్యాఖ్యానించారు.