Share News

దొంగలనే సాక్షులుగా పిలవడమేంటి?

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:32 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేటీఆర్‌, హరీశ్‌రావు సహా అందరినీ సాక్షులుగా పిలిస్తే మరి అసలు దోషులెవరని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు.

దొంగలనే సాక్షులుగా పిలవడమేంటి?

  • కేటీఆర్‌, కేసీఆర్‌లకు కాంగ్రెస్‌ క్లీన్‌చిట్‌ ఇస్తోందా?

  • స్కాంలు బయటపడ్డప్పుడల్లా డ్రామాలు: బండి సంజయ్‌

హైదరాబాద్‌/బిట్స్‌ పిలానీ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేటీఆర్‌, హరీశ్‌రావు సహా అందరినీ సాక్షులుగా పిలిస్తే మరి అసలు దోషులెవరని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో దొంగలనే సాక్షులుగా పిలవడమేంటని అన్నారు. ఈ కేసులో కేటీఆర్‌, కేసీఆర్‌లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం క్లీన్‌చిట్‌ ఇస్తోందా..? అని నిలదీశారు. మంత్రులేమో కేటీఆర్‌ను సాక్షిగా పిలిచామని చెబుతుంటే.. పోలీస్‌ కమిషనర్‌ ఏమో విచారణకు పిలిచామంటున్నారని.. దీన్నిబట్టి సిట్‌ విచారణను ప్రత్యక్షం గా, పరోక్షంగా మంత్రులు ప్రభావితం చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా సిట్‌కు స్వేచ్ఛనివ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగితే సిట్‌ అధికారుల విశ్వసనీయత పోతుందని హెచ్చరించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల తో సంజయ్‌ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తమ స్కాంలు బయటపడినప్పుడల్లా కాంగ్రెస్‌ నేతలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్‌ కుటుంబం సింగరేణిని దోచుకుంటే.. కాంగ్రెస్‌ పాలనలో మంత్రులు, దళారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. 2014 నుంచి సింగరేణిలో గనుల కేటాయింపులో జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కేటీఆర్‌ను నిందితుడిగా పిలిచారా?

ఫోన్‌ ట్యాపింగ్‌తో మంది కొంపలు ముంచిన కేటీఆర్‌ను సాక్షిగా విచారణకు పిలిచి వాంగ్మూలం తీసుకోవడమే విడ్డూరంగా ఉందని సంజయ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని హకీంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్‌ కేసులో కేటీఆర్‌ను నిందితుడిగా పిలిచారా..? లేక వాంగ్మూలం కోసం పిలిచారా..? అని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

Updated Date - Jan 25 , 2026 | 03:32 AM