ఆపరేషన్ సిందూర్‌లో బీఎస్ఎఫ్ పోరాటం అద్వితీయం
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:20 AM
ఆపరేషన్ సిందూర్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పోరాటం అద్వితీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో వారి సేవలు ప్రశంసనీయం: సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పోరాటం అద్వితీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంచు పర్వతాలు, క్లిష్టమైన వాతావరణంలో బీఎ్‌సఎఫ్ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని చెప్పారు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా గురువారం శ్రీనగర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంప్‌సలో కేంద్ర మంత్రి సంజయ్ ఐజీ అశోక్ యాదవ్‌తోపాటు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో బీఎస్ఎఫ్ అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న ఇబ్బందులు, ఆపరేషన్ సిందూర్‌లో బీఎస్ఎఫ్ జవాన్ల పాత్రను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారు వివరించారు. అత్యంత క్లిష్టమైన వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. బీఎస్ఎఫ్ జవాన్ల భాగస్వామ్యంతోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని వివరించారు. కనీస సౌకర్యాలు, వసతి లేకపోయినప్పటికీ సమర్థంగా విధులు నిర్వహిస్తున్న జవాన్ల ధైర్యసాహసాలను సంజయ్ కొనియాడారు. అంతకుముందు బండి సంజయ్ శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్‌ను సందర్శించారు. ఆ తర్వాత దాల్ సరస్సును సందర్శించి.. బోటులో ప్రయాణించారు.