Share News

బీఆర్‌ఎస్‌ అంటే భూ రాక్షసుల సమితి

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:24 AM

బీఆర్‌ఎస్‌ అంటే.. ‘భూ రాక్షసుల సమితి’ అని.. ఆ పార్టీ నేతలు పదేళ్ల పాలనలో కనిపించిన భూములన్నీ కబ్జా చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ అంటే భూ రాక్షసుల సమితి

  • కాంగ్రెస్‌ అంటే ‘ఖాన్‌’గ్రె్‌స.. అది రేస్‌లోనే లేదు.. బీఆర్‌ఎస్‌ పాలనలో కనిపించిన భూములన్నీ కబ్జా

  • మళ్లీ ఆ పార్టీని గెలిపిేస్త ఇళ్లు కూడా కబ్జా చేస్తారు

  • కాంగ్రెస్‌ ప్రభుత్వం వద్ద పైసల్లేవు.. గెలిపిస్తే ఏం చేస్తారు?

  • కరీంనగర్‌లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తా

  • కరీంనగర్‌లో మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి

హైదరాబాద్‌/కరీంనగర్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అంటే.. ‘భూ రాక్షసుల సమితి’ అని.. ఆ పార్టీ నేతలు పదేళ్ల పాలనలో కనిపించిన భూములన్నీ కబ్జా చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కరీంనగర్‌, దాని పరిసర ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడిన 46 మంది బీఆర్‌ఎస్‌ నేతలను తానే జైలుకు పంపానని తెలిపారు. మళ్లీ బీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే ప్రజల ఇళ్లలోకి దూరి పుస్తెల తాళ్లు కూడా దోచుకుంటారని అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలపై 2,600పైగా ఫిర్యాదులు అందాయంటే వారి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కరీంనగర్‌ మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోతిరాంపూర్‌ చౌరాస్తాలో నిర్వహించిన స్ర్టీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో బండి సంజయ్‌ ప్రసంగించారు. మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


ఓట్లప్పుడు దండాలు.. ఆ తర్వాత కబ్జాలు

బీఆర్‌ఎస్‌ నేతలు నిత్యం భూ కబ్జాల గురించే ఆలోచిస్తారని బండి సంజయ్‌ ఆరోపించారు. ‘భూ రాక్షసుల సమితికి రెండే లక్ష్యాలు. ఎవరి పొట్ట కొట్టాలి? ఎట్లా పైసలు సంపాదించాలి? అందుకోసమే ఓట్లప్పుడు మీకు దండాలు పెడతారు. తర్వాత మీ జీవితాలతో ఆటలాడుకుంటారు. ఇలాంటోళ్లకు పొరపాటున ఓట్లేసినా పాపం తగులుతుంది. అందుకే ఈ ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని అన్నారు.

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌కూ సర్కారు దగ్గర డబ్బు లేదు

కాంగ్రెస్‌ ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, మునిసిపల్‌ ఎన్నికల్లో వారికి ఓట్లేసినా ఉపయోగం ఉండదని బండి సంజయ్‌ అన్నారు. ‘డబ్బు లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గ్యారంటీలనే అమలు చేయడం లేదు. నన్ను కోసినా నయాపైసా లేదని సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా చెప్పారు. మరి ఆ పార్టీని గెలిపిేస్త కరీంనగర్‌ అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దొంగ నోట్లు ముద్రిస్తారా? రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్స్‌ కూడా ఇవ్వకుండా వారిని ప్రభుత్వం గోసపెడుతోంది. బీజేపీని గెలిపించి మేయర్‌ పీఠం అప్పగిస్తే.. కరీంనగర్‌కు ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తానని ప్రధాని మోదీ చెప్పారు. మోదీని కలిసి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది’ అని భరోసా ఇచ్చారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ‘ఖాన్‌’గ్రె్‌సగా మారిపోయిందని, ఆ పార్టీకి గ్రేస్‌ లేదు.. మునిసిపల్‌ ఎన్నికల్లో అది రేస్‌లోనే లేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌ అభివృద్ధికి తాను రూ.1,500 కోట్లు తీసుకొచ్చానని, అది తప్పయితే తనపై కేసు పెట్టుకోవచ్చని సవాల్‌ విసిరారు. మునిసిపల్‌ ఎన్నికలు మోదీ అభివృద్ధికి- బీఆర్‌ఎస్‌ అవినీతికి మఽధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 03:24 AM