అసోంలో గణనీయంగా తగ్గిన తీవ్రవాదం
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:08 AM
అసోంలో గడచిన పదేళ్లలో తీవ్రవాదం గణనీయంగా తగ్గిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు.
కేంద్రం చొరవతో ప్రజల జీవనం మెరుగు: బండి సంజయ్
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అసోంలో గడచిన పదేళ్లలో తీవ్రవాదం గణనీయంగా తగ్గిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. దాదాపు 10వేల మంది ఉల్ఫా తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా గురువారం అసోం రాజధాని గువాహటిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేటాయించడంతో పాటు ఆయా పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. కాగా, గువాహటిలోని ప్రసిద్ధ శక్తి పీఠమైన కామాఖ్య దేవి అమ్మవారి ఆలయాన్ని సంజయ్ దర్శించుకున్నారు.