Share News

ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై విచారణ జరపండి

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:16 AM

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను దారి మళ్లిస్తున్న వ్యవహారంపై తక్షణం ప్రత్యేక విచారణ...

ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై విచారణ జరపండి

  • బాధ్యులపై తగిన చర్యలు తీసుకోండి

  • కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌కు బండి సంజయ్‌ లేఖ

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను దారి మళ్లిస్తున్న వ్యవహారంపై తక్షణం ప్రత్యేక విచారణ, ఆడిట్‌ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌.. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ను కోరారు. పంచాయతీలకు కేటాయుంచిన నిధులు నిర్దేశిత లక్ష్యాలకే వినియోగించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బండి సంజయ్‌ ఆదివారం రాజీవ్‌ రంజన్‌సింగ్‌కు లేఖ రాశారు. ‘15వ ఆర్థిక సంఘం నిధులు తాగునీరు, పారిశుధ్యం, ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ, గ్రామ మౌలిక సదుపాయాలు, ప్రజా ఆస్తుల నిర్వహణ వంటి నిర్దేశిత పనులకే వినియోగించాలి. తెలంగాణలో మాత్రం నిర్దేశిత లక్ష్యాలకు భిన్నంగా ఖర్చు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. సర్పంచులపై ఒత్తిడి తెచ్చి ఈ నిధులను ఇతర ఖర్చులకు వినియోగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల అసలు ఉద్దేశం దెబ్బతింటోంది’ అని పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం రెండు నెలలుగా ఈ నిధులను విడుదల చేస్తోంది. ఇప్పటివరకు విడతలవారీగా రూ.2,293.74 కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. మరో రూ.729.41 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది’ అని సంజయ్‌ లేఖలో వివరించారు.

నిరుద్యోగులతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చెలగాటం: మహేశ్వర్‌రెడ్డి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వస్తే నిరుద్యోగులు ఆయన్ను నిలదీయడం ఖాయమని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రె్‌సను డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల అవకాశవాద రాజకీయాల మధ్య రాష్ట్ర ప్రజానీకం నలిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Jul 20 , 2026 | 03:16 AM