దమ్ముంటే ట్యాపింగ్ సూత్రధారులను అరెస్టు చేయండి: బండి సంజయ్
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:11 AM
దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులను తక్షణం అరెస్టు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు.
ఢిల్లీకి, ఫాంహౌ్‌సకు ఇంకా డీల్ కుదరలేదా? అని వ్యాఖ్య
హైదరాబాద్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులను తక్షణం అరెస్టు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. ఈ కేసులో విచారణ పేరుతో ఇంకెన్నాళ్లీ డ్రామాలని ప్రశ్నించారు. ‘ఢిల్లీకి, ఫాంహౌ్‌సకు మధ్య ఇంకా డీల్ కుదరలేదా? ఫోన్ ట్యాపింగ్‌లో సూత్రధారులైన తండ్రీకొడుకులను ఎందుకు విచారించడం లేదు? ఈ కేసులో ఒక్క నాయకుడినైనా అరెస్టు చేశారా? తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారంటూ హరీశ్‌రావు గతంలో చెప్పలేదా? చాలా రోజులు ఆయన ఫోన్ కూడా మాట్లాడని విషయం మీకు తెలియదా?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు. కర్ర విరగదు.. పాము చావదు అన్నట్లుగా ఈ కేసు సాగుతోందని ఆయన మండిపడ్డారు. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు విచారణలో కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ సర్కార్‌లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ట్యాపింగ్ కేసును వాడుకుంటోందని ఆరోపించారు. సిట్ సాగదీత విచారణను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ఈ కేసును సాగదీసేలా ఉందని వ్యాఖ్యానించారు. కాగా, హిందీతో పాటు భారతీయ భాషలు కేవలం గతానికి చెందిన మన వారసత్వం మాత్రమే కాదని, అవి దేశ భవిష్యత్తుకు పునాదులుగా నిలుస్తాయని బండి సంజయ్ అన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని దేవీ అహల్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘మధ్య, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల ఉమ్మడి ప్రాంతీయ అధికారిక భాషా సమ్మేళనం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ భాషకు విశిష్ట సేవలందించిన పలువురికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ తన సాంస్కృతిక పునాదితో అనుసంధానమవుతూ ఆత్మనిర్భరతవైపు దృఢంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.