ఆరు గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు?
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:54 AM
ఆరు గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఐదేళ్లలో సగభాగం పూర్తయినా.. హామీల్లో 10 శాతం పూర్తిచేయలేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఆరు గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో సగభాగం పూర్తయినా ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. సీఎంకు, మంత్రులకు అధికారం కాపాడుకోవాలనే యావే తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్టదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు సంజయ్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సీఎం గారూ..! డూప్లికేట్ గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు పంపాలనే శ్రద్ధే తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టవా? మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని చెప్పి రెండున్నరేళ్లు అయ్యింది... ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? అవ్వాతాతలకు రూ. 4 వేల పింఛను ఎందుకు ఇవ్వడం లేదు? విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డును ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నిరుద్యోగులకు ప్రతినెలా భృతి ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ అమలుపై ఎన్నడైనా చర్చించారా? రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్‌లను చెల్లించకపోవడంతో 61 మంది చనిపోయినా మీలో చలనం లేదా? ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలు, పెండింగ్ బకాయిలు అందక ఇబ్బంది పడుతున్నా మీకు పట్టదా? ఫీజు రీఈంబర్స్‌మెంట్ బకాయిలివ్వకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది యాజమాన్యాలు అల్లాడుతున్న సంగతి మరచిపోయారా? డూప్లికేట్ గాంధీ కుటుంబానికి మూటలు పంపి పదవులు కాపాడుకోవాలనే తాపత్రయమే తప్ప 6 గ్యారంటీల అమలుపై ఎన్నడైనా చర్చించారా?’ అని సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.