తేజస్వీ తెలంగాణను అవమానించలేదు
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:42 AM
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్‌లో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే వందలాది మంది తెలంగాణ యువకులు బలిదానం ...
ఉద్యమకారులను దేశభక్తులతో పోల్చారు
కేంద్ర మంత్రి బండి సంజయ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్‌లో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే వందలాది మంది తెలంగాణ యువకులు బలిదానం చేశారని చెబుతూ దేశ విభజన అంశాన్ని ప్రస్తావించారే తప్ప ఆయన తెలంగాణను అవమానించలేదని కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ మేరకు మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు వివాదం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన సీఎం రేవంత్ నాడు సోనియా గాంధీని బలిదేవత అంటూ తూలనాడిన ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే. నువ్వు కొట్టినట్లు చేయ్. నేను ఏడ్చినట్లు చేస్తానని ఒకరికొకరు డ్రామాలాడుతున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులు ఎటు పోయారు? వాళ్ల బతుకులు ఎందుకు మారలేదు? కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలే లాభపడ్డారు. కేసీఆర్, రేవంత్ కుటుంబమే లాభపడ్డది నిజం కాదా? తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటి?’ అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేేస్త.... రేవంత్ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల చేతికి చిప్ప ఇచ్చింది నిజం కాదా? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.