రబీ కొనుగోళ్లు.. రైతుల కష్టాలను పట్టించుకోరేం?
ABN , Publish Date - May 02 , 2026 | 05:31 AM
రబీ సీజన్ కొనుగోళ్లపై సమీక్షించడం లేదేమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిలదీశారు.
వడ్లకు బోనస్ హామీ ఉత్తదేనా
సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
హైదరాబాద్, మే 1(ఆంధ్రజ్యోతి): రబీ సీజన్ కొనుగోళ్లపై సమీక్షించడం లేదేమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిలదీశారు. మండుటెండలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వడగాల్పులతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్ల తీరుపైనా, రైతుల కష్టాలను పరిష్కరించే దిశగా ఆదేశాలిచ్చారా.. కనీసం ‘ రైతు తన పంటనైనా అమ్ముకునేలా చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు అని బండి సంజయ్ ప్రశ్నించారు. డిజాస్టర్ శాఖ మంత్రి ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ను రూపొందించారా? మీకు, మీ మంత్రికి కరప్షన్, కలెక్షన్, ల్యాండ్ సెటిల్‌మెంట్ తప్ప సామాన్యుల కష్టాలు కనిపించవా’ అంటూ ఆయన సీఎంకు లేఖ రాశారు. వడ్లకు బోనస్ ఉత్తిదేనా అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పౌరసరఫరాల కార్పొరేషన్‌ను రూ.56 వేల కోట్ల అప్పుల్లో ముంచితే, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో దానిని రూ.లక్ష కోట్లకు పెంచిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండున్నరేళ్లలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారన్నారు. వారికి ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన రూ.5 వేల కోట్లు చెల్లించాలి. కానీ రూ.260 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని.. రాష్ట్ర రైతాంగంలో 50 శాతం మందికి ఎగ్గొట్టారని సంజయ్ విమర్శించారు.
తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల
తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలుచుకున్నా, ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు సాధించినా అధికారంలోకి వస్తేనే మరింత వేగవంతమైన అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ నెల 10న ప్రధాని మోదీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు నాంది పలకబోతోందని వ్యాఖ్యానించారు. సీనియర్ నేతలతో ఆయన ప్రధాని పర్యటనపై సన్నాహక సమావేశం నిర్వహించారు.