‘పునర్విభజన’తో దక్షిణాదికి లాభమే
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:30 AM
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్ప, నష్టం ఉండబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
రేవంత్ ఆరోపణల్లో వాస్తవం లేదు.. అబద్ధాల పునాదులపై ఆయన పాలన
5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసమే డ్రామా.. కాంగ్రెస్‌కు పరాజయం తప్పదు: బండి సంజయ్
కరీంనగర్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్ప, నష్టం ఉండబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ పునర్విభజనలో భాగంగా 50 శాతం సీట్లను పెంచితే దక్షిణాదికి తీవ్రనష్టం జరుగుతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి, జాతీయవాదం మచ్చుకైనా కనిపించడం లేదని, రేవంత్‌రెడ్డి వాఖ్యలను దేశభక్తి ఉన్న జాతీయవాదులెవరూ జీర్ణించుకోలేరని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అబద్ధాల పునాదులపైన పాలన చేస్తున్నారని, ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకో కొత్త అంశాన్ని తెరమీదకు తెస్తూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆయన తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఉత్తరాదికి లాభం, దక్షిణాదికి నష్టమని మాట్లాడుతూ దేశాన్ని ముక్కలు చేయాలని కుట్రల చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కొత్త డ్రామాలాడుతున్నారని, ఇంకెన్నాళ్లు ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి చలికాచుకుంటారని విమర్శించారు. తమిళనాడులో ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నడో మరిచిపోయారని, కేరళంలో కాంగ్రెస్ కూటమికి ఘోర పరాజయం తప్పదని, పుదుచ్చేరిలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పారు. బెంగాల్, అసోం రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ద్వేషమని, అందుకే 33శాతం రిజర్వేషన్లు అమలు చేయలేదని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్డీయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు.