మూటల కోసమే రాహుల్ రాష్ట్ర పర్యటన
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:18 AM
రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన మూటల కోసమా, లేక కాంగ్రెస్ శిక్షణ తరగతుల కోసమా అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
శిక్షణ తరగతులు కాదు.. బాధిత ప్రాంతాల్లో పర్యటించాలి
కాంగ్రెస్ నిర్ణయంతో గాంధీ ఆత్మ క్షోభిస్తుంది: బండి సంజయ్
కామారెడ్డి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన మూటల కోసమా, లేక కాంగ్రెస్ శిక్షణ తరగతుల కోసమా అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కేవలం శిక్షణా తరగతులకే పరిమితం కాకుండా.. మూసీ పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్ల పేరిట ఇళ్లు కోల్పోయిన ప్రాంతాల్లో పర్యటించి పేదల గోడును వినాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీజేపీ శిక్షణ తరగతులకు హాజరైన ఆయన, పార్టీ కార్యాలయంలో బాన్సువాడ బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రేవంత్ సర్కార్ పేదల ఇళ్లను కూలుస్తున్నా రాహుల్‌గాంధీ మౌనంగా ఉండటం వెనక అంతర్యమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పేదల ఇళ్లు కూలుస్తూ, మరోవైపు పెద్దలతో బేరసారాలు దిగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు కట్టిస్తుంటే, కాంగ్రెస్ సర్కార్ మాత్రం కూల్చడంలో ముందుందని విమర్శించారు. గాంధీ విగ్రహం పేరుతో పేదల ఉసురు తీస్తున్నారని, ఓవైసీ అక్రమంగా నిర్మించిన ఫాతిమా కాలేజీని కూల్చమంటే మాత్రం విద్యార్థుల భవిష్యత్తు అంటూ సాకులు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనను తలపించేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. ఇకపై పేదల ఇళ్లను కూల్చాలని చూస్తే, కాంగ్రెస్ నేతల ఇళ్లను కూల్చేందుకు బీజేపీ బుల్డోజర్లతో వస్తుందని హెచ్చరించారు.