కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకో
ABN , Publish Date - May 09 , 2026 | 06:52 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారంవల్లే ఆయన తండ్రి కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితమయ్యారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ఫాంహౌజ్ డ్రగ్స్ కేసులు మాకు తెలియదు
రాష్ట్రంలో బీఆర్‌ఎస్
అధికారంలోకి రావడం కల్ల: సంజయ్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారంవల్లే ఆయన తండ్రి కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితమయ్యారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కేటీఆర్‌ను చూసి బీఆర్ ఎస్ కార్యకర్తలే అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రధాని రాక సందర్భంగా బండి నేతృత్వంలో శుక్రవారం ఆర్టీసీ ఎక్స్‌రోడ్ నుంచి అమీర్‌పేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేటీఆర్ మాదిరిగా దోచుకోవడం నాకు తెలియదు.. రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టడం నాకు తెలియదు.. డ్రగ్స్ తీసుకోవడం నాకు తెలియదు.. కాళేశ్వరం, ఈ-ఫార్ములా, విద్యుత్ కొనుగోళ్ల అవినీతి మాకు తెలియదు.. ఫాంహౌజ్ డ్రగ్స్ కేసులు మాకు తెలియదు.. మంది కొంపలు ముంచడం అసలే తెలియదు.. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేలా చేయడం మాకు తెలియదు.. మాకు ఏం తెలుసో ప్రజలు నిర్ణయిస్తారు. మీకు ఏం తెలుసో ప్రజలు గ్రహించి మిమ్మల్ని ఓడించారు’ అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అహంకారం చూపించి, ఇప్పుడు అధికారం పోయాక కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఏం చేసినా రాష్ట్రంలో ఇక అధికారంలోకి రావడం కల్ల అని అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి తాము నిధులు తెస్తుంటే... కాంగ్రెస్ నేతలు తెలంగాణ సొమ్మును ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు పంపుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నోటి దురుసుతనమే తమ పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ అన్నారు.