బీఆర్‌ఎస్‌కు ఓటేస్తేడ్రైనేజీలో పడ్డట్లే!
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:42 AM
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంటి పన్ను పెంచి, ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు.
ఎన్నికలు ముగియగానే ఇంటి పన్ను పెంచనున్న సర్కారు
హామీలు అమలు చేయని కాంగ్రె్‌సకు ఓటెందుకేయాలి?
రెండేళ్లలో కరీంనగర్ కార్పొరేషన్‌కు నయా పైసా ఇవ్వలే
కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే..
మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెస్తా
‘మునిసిపల్’ ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంటి పన్ను పెంచి, ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయన్నారు. 6 గ్యారెంటీలతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రె్‌సకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. సోమవారం ఆయన కరీంనగర్‌లో మునిసిపల్ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. రెండేళ్లలో మునిసిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్‌కు నయాపైసా ఇవ్వని కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని నిలదీశారు. మరోవైపు పదేళ్ల పాలనలో అవినీతి, అరాచకాలు, కబ్జాలతో ప్రజలను దోచుకుతిన్న బీఆర్‌ఎస్ నేతలకు ఎందుకు ఓటేయాలని సంజయ్ ప్రశ్నించారు. ఎక్కడా అధికారంలో లేని ఆ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తుందన్నారు. పొరపాటున బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే డ్రైనేజీలో పడ్డట్లేనని చెప్పారు. బీఆర్‌ఎస్ గెలిస్తే కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుందని ఆరోపించారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అని స్పష్టం చేశారు. తాను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే బీఆర్‌ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి, ఆ నిధులు తామే తెచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కేసీఆర్‌నే బయటికొచ్చేలా చేశా.. కాంగ్రెస్ ఎంత?
పాలనను గాలికొదిలేసి, తాగి ఫాంహౌ్‌సలో పడుకున్న కేసీఆర్‌నే పోరాటాలు చేసి గల్లాపట్టి బయటకు వచ్చేలా చేశానని, ఇక కాంగ్రెస్ ఎంత అని సంజయ్ అన్నారు. అది 3 రాష్ట్రాలకే పరిమితమైన పార్టీ అని ఎద్దేవా చేశారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ సహా అనేక రూపాల్లో నిధులు తీసుకొచ్చి కరీంనగర్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. బీజేపీకి మేయర్ పీఠాన్ని అప్పగిస్తే కార్పొరేటర్లందరితో కలిసి ప్రధాని మోదీ వద్దకు వెళ్లి, మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డే చెబుతున్నారని.. అప్పుడు కరీంనగర్‌ను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గ్యారెంటీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కబ్జాలకు పాల్పడి జైలుకు పోయినోళ్లలో సగం మందికి బీఆర్‌ఎ్‌సలో టికెట్లు ఇచ్చారని.. వాళ్లకు ఓట్లేస్తే జనం జాగాలతోపాటు పుస్తెల తాళ్లు కూడా గుంజుకుపోతారని చెప్పారు. తాను నిధులు తీసుకురాలేదంటూ గంగుల కమలాకర్, వినోద్ కుమార్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. కరీంనగర్ కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చాననే వివరాలతో 5లక్షల పుస్తకాలను ఇంటింటికీ పంపుతున్నానని తెలిపారు.
బీజేపీ అభ్యర్థులపై అవినీతి ఆరోపణల్లేవు
బీజేపీ అభ్యర్థుల మీద అవినీతి ఆరోపణలు లేవని, కబ్జాల చరిత్ర లేదని సంజయ్ చెప్పారు. కరీంనగర్ కోసం నిరంతరం కష్టపడుతున్నారన్నారు. కాషాయ జెండా పట్టి జైశ్రీరాం అంటూ ప్రజల సమస్యల కోసం కొట్లాడుతున్నారని, లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. తనను ఎంపీగా గెలిపించేందుకు ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించారని.. ఇప్పుడు వాళ్లను గెలిపించేందుకు మీ ముందుకు వచ్చానని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్ని కోరారు.