రేవంత్, కేటీఆర్ మధ్య డీల్
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:21 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రేమ, అభిమానం ఎక్కువని, అందుకే డ్రగ్స్, ఫార్ములా-ఈ కార్, ఫాంహౌజ్ కేసుల జోలికి వెళ్లడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
వారిద్దరికీ అంతర్గత ఒప్పందాలున్నయ్
అందుకే డ్రగ్స్, ఫార్ములా-ఈ కార్, ఫాంహౌజ్ కేసుల జోలికి వెళ్లడం లేదు
కవిత, కేటీఆర్ మధ్య సయోధ్యకు సీఎం యత్నం
హరీశ్‌రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నారు
కాళేశ్వరం విచారణలో సర్కారుకు స్పష్టత లేదు
బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు ఎన్నటికీ జరగబోదు: బండి
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రేమ, అభిమానం ఎక్కువని, అందుకే డ్రగ్స్, ఫార్ములా-ఈ కార్, ఫాంహౌజ్ కేసుల జోలికి వెళ్లడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రేవంత్, కేటీఆర్ ఒక్కటేనని, వారిద్దరి మధ్య అంతర్గత ఒప్పందాలు జరిగాయని, ఇద్దరికీ డీల్ కుదిరిందని అన్నారు. కేటీఆర్, తాను ఒక్కటి కాదన్న అంశాన్ని నిరూపించుకోవాలనుకుంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి అకున్ సబర్వాల్ నివేదికను బహిర్గతం చేయాలని రేవంత్‌కు సవాల్ చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం హరీశ్‌రావును టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు తప్ప, కేటీఆర్ అవినీతిపై మాట్లాడటం లేదని ఆరోపించారు. ‘కేటీఆర్‌కు రేవంత్ నీడలా వ్యవహరిస్తున్నారు.. ఇద్దరూ ఒకరికి ఒకరు రక్షణ కవచంగా ఉంటున్నారు. కేటీఆర్, రేవంత్‌ల వైఖరిపై హరీశ్ ఆలోచించుకోవాలి’ అని అన్నారు. ‘కేటీఆర్‌కు హరీశ్‌కు మధ్య గ్యాప్ పెంచడం.. కవిత, కేటీఆర్ మధ్య సయోధ్య కుదర్చడం.. భవిష్యత్తులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం.. ఇదీ రేవంత్ ప్లాన్. అయితే, మొన్నటివరకు రేవంత్ మాట విన్న కవిత ఇప్పుడు ఆయన మాటలను పట్టించుకోవడం లేదు. హరీశ్‌తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం సలహా కూడా ఇస్తున్నారు’ అని సంజయ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జైల్లో వేయించినా కేటీఆర్‌పై రేవంత్‌కు అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్‌పై రేవంత్‌కు ఆవేశం, పౌరుషం తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీశ్‌పై ఉన్న కసి.. డ్రగ్స్, ఫార్ములా ఈ-కార్ రేసు, ఫాంహౌజ్ కేసుల్లో ఉన్న కేటీఆర్‌పై ఎందుకు లేదో రేవంత్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై విచారణలో రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదని మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై కాకుండా కేవలం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంపై మాత్రమే సీబీఐ విచారణ కోరడం వెనుక ఆంతర్యమేంటి? లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని మీరే చెప్పారు కదా? మరి సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డకు సంబంధించి రూ.9 వేల కోట్ల అవినీతిపైనే సీబీఐ విచారణ జరపాలని ఎందుకు పట్టుపడుతున్నట్లు? అందులోనే హరీశ్ పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారా? బీఆర్‌ఎస్ పాలనలో జరగని అవినీతి ఏమైనా ఉందా? కేటీఆర్ పెద్ద అవినీతి పరుడని తెలిసినా ఎందుకు కాపాడుతున్నారు? ఆయనపై పెట్టిన కేసులేమయ్యాయి?’ అని రేవంత్‌ను సంజయ్ ప్రశ్నించారు. కవిత కొత్త పార్టీకి స్టార్టింగ్ ట్రబుల్ ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు ఎన్నటికీ జరగబోదని, కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమని అన్నారు.
ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమే
‘తనను సీఎం చేయనందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోపంగా ఉన్నారు.. అందుకే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారానికి కర్ణాటక నుంచి డబ్బులు వెళ్లడం లేదు. మొత్తం డబ్బంతా తెలంగాణ నుంచే వెళ్తున్నాయి’ అని సంజయ్ ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి అనుకూలమని, కాంగ్రెస్ ఏ ఒక్క రాష్ట్రంలోనూ గెలిచే అవకాశమే లేదని అన్నారు. అసోం, బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తమిళనాడులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళలోనూ బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందని, సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని సంజయ్ వివరించారు.