Share News

ఏయ్‌ ఒవైసీ.. కరీంనగర్‌ నా అడ్డా

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:51 AM

‘ఏయ్‌ ఒవైసీ.. కరీంనగర్‌ నా అడ్డా.. ఇక్కడ ఎగిరేది కాషాయ జెండానే.. పచ్చ జెండాను పాతరేస్తాం’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు.

ఏయ్‌ ఒవైసీ.. కరీంనగర్‌ నా అడ్డా

  • ఎగిరేది కాషాయ జెండానే: బండి సంజయ్‌

భగత్‌నగర్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ‘ఏయ్‌ ఒవైసీ.. కరీంనగర్‌ నా అడ్డా.. ఇక్కడ ఎగిరేది కాషాయ జెండానే.. పచ్చ జెండాను పాతరేస్తాం’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు. శనివారం కరీంనగర్‌లోని బ్యాంక్‌ కాలనీ, భగత్‌సింగ్‌ నగర్‌లో జరిగిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని ఎంఐఎంకు అప్పగించేందుకు కాంగ్రెస్‌ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్నారు. అందుకే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ జగిత్యాల, కరీంనగర్‌ వచ్చి ఎంఐఎం సత్తా చూపుతామంటూ బీరాలు పలుకుతున్నాడని అన్నారు. బీఆర్‌ఎ్‌సను భూస్థాపితం చేస్తామని, ఈసారి పచ్చజెండాను పాకిస్తాన్‌కు పంపుతామని చెప్పారు. కరీంనగర్‌లో మతం పేరుతో మారణ హోమం సృష్టించేందుకు ఎంఐఎం కుట్ర చేస్తోందన్నారు. ముస్లింలను రెచ్చగొట్టి లబ్ధిపొందుతున్న ఒవైసీ కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టి, పేద ముస్లింలను బికారులను చేసిందని విమర్శించారు. ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసి ముస్లిం మహిళలకు భరోసా కల్పించామని బండి సంజయ్‌ అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దుకు ఎంఐఎం అనుకూలమా.. వ్యతిరేకమా.. చెప్పే దమ్ముందా..? అని అసద్‌కు సవాల్‌ విసిరారు. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు సైతం తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కరీంనగర్‌లో ఆదర్శనగర్‌ నుంచి కోర్టు చౌరస్తా వరకు స్మార్ట్‌ సిటీ నిధులతోనే అభివృద్ధి చేశామని తెలిపారు. తాను కేంద్రం నుంచి రూ.1,500 కోట్ల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేశానని, ఆ వివరాలతో చిన్న పుస్తకాన్ని ముద్రించి ఇంటింటికీ పంపితే.. గంగుల కమలాకర్‌ అవి తమ నిధులని చెబుతున్నారని మండిపడ్డారు. గంగుల ముఖం మోదీకి తెలుసా..? అని ప్రశ్నించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 4 సీట్లకే పరిమితం కాబోతోందని జోస్యం చెప్పారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని అప్పగిస్తే వరదలా నిధులు తీసుకొచ్చి కరీంనగర్‌ రూపురేఖలు మారుస్తానని సంజయ్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Feb 08 , 2026 | 06:51 AM