6 గ్యారంటీలు అమలైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:26 AM
‘ఆరు గ్యారంటీలు రాష్ట్రంలో అమలైనట్లు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. లేదా వాటిలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని నిరూపిస్తా..
అమలు చేయలేదని నేను నిరూపిస్తా
సీఎం పదవికి రాజీనామా చేస్తారా?
రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్
హుజూరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ‘ఆరు గ్యారంటీలు రాష్ట్రంలో అమలైనట్లు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. లేదా వాటిలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని నిరూపిస్తా.. మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా?’ అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సవాల్ విసిరారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని, ఇది పచ్చి అబద్ధమని విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డు స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అబద్ధాలాడడంలో రేవంత్‌రెడ్డికి అస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ‘కేరళ మీడియాను వెంట పెట్టుకొని తెలంగాణలో ఏ గ్రామానికైనా వెళ్దాం.. మహిళలకు నెలనెలా రూ. 2,500, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, రూ.4వేల ఆసరా పెన్షన్లు, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా పైసలిస్తున్నట్లు నిరూపిస్తే నేను వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అని అన్నారు. గతంలో బిహార్, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కారణమని విమర్శించారు. రేవంత్‌రెడ్డి కేరళకు వెళ్లింది కాంగ్రెస్ అధిష్ఠానానికి మూటలు అప్పగించడానికేనని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్ధాలతోనే కేరళలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్నారు. 6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు.