ఫిరాయింపులపై కాంగ్రెస్‌ది రాజకీయ వ్యభిచారం
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:32 AM
ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పీకర్ ఆధారాల్లేవనడం దుర్మార్గం
ఓట్ల కోసం వచ్చే వారిని ఏ పార్టీలో ఉన్నారో నిలదీయండి
నీచ రాజకీయాలు చేసే కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు బుద్ధి చెప్పాలి
నా జోలికొస్తే కేటీఆర్ బతుకును రోడ్డుకీడుస్తా: బండి సంజయ్
సిరిసిల్ల, వేములవాడలో కేంద్రమంత్రి మునిసి‘పోల్స్’ ప్రచారం
సిరిసిల్ల, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పునివ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం సిరిసిల్ల, వేములవాడల్లో ఆయన మునిసిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో సంజయ్ మాట్లాడారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్‌లోనే సంసారం చేస్తున్నారు.. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లోనే మీటింగ్‌లు పెడుతున్నారు.. వాళ్ల చేతికే బీ ఫారాలు ఇస్తారు.. కళ్ల ముందు ఇవన్నీ కన్పిస్తున్నా.. పార్టీ మారినట్లు ఆధారాల్లేవని స్పీకర్ కేసు కొట్టివేయడం దారుణం.. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి మచ్చ తెచ్చి చరిత్రహీనులు కావొద్దు’ అని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను ‘ఏ పార్టీలో ఉన్నారు.. ఎవరికి, ఎందుకు ఓటేయాలి’ అని నిలదీయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నీచ రాజకీయాలకు బుద్ధి చెప్పాలని, వాళ్ల అవినీతి, అక్రమాలకు చెంపపెట్టుగా తీర్పు ఇవ్వాలని కోరారు. ‘బీజేపీకి భయపడి కేసీఆర్ కొడుకు కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డా పెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నాడట.. ఆ డబ్బులు మనవే.. తీసుకోండి.. ఓట్లు మాత్రం కమలం పువ్వు గుర్తుకు వేయండి. బీజేపీ అభ్యర్థుల దగ్గర పైసల్లేకపోవచ్చు.. కానీ మీ కోసం కొట్లాడే దమ్ముంది’ అని వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ కొడుకు లెక్క అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు.. కార్యకర్తగా కష్టపడి మీకోసం లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయాను. కేటీఆర్.. మళ్లీ నా జోలికొస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా..’ అని హెచ్చరించారు. కార్యకర్తలకు విలువనిచ్చే బీజేపీలో చేరాలంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలేమయ్యాయి..?
‘కాంగ్రెస్ వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశారా..? మహిళలకు నెలకు రూ.2,500, పెళ్లికి తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీ ఇచ్చారా.. అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా..? తనను కోసినా పైసల్లేవని సీఎం రేవంత్ రెడ్డే చెప్పిండు..’ అని సంజయ్ అన్నారు. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని.. సిరిసిల్ల మునిసిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే.. పెద్ద ఎత్తున నిధులు తెస్తామని హామీనిచ్చారు. ఇక వేములవాడలో ఆగమశాస్త్ర సంప్రదాయాలను పాటించకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. రాతితో నిర్మించాల్సిన ఆలయాన్ని సిమెంట్‌తో కడుతున్నారన్నారు. గుడి నిర్మాణం పేరుతో కాంగ్రెస్ నేతలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, సిరిసిల్ల పార్టీ ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య, బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు.