Share News

కేటీఆర్‌కు సిగ్గుండాలి

ABN , Publish Date - May 08 , 2026 | 06:37 AM

దాడుల సంప్రదాయం గురించి మాట్లాడ్డానికి బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సిగ్గుండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు.

కేటీఆర్‌కు సిగ్గుండాలి

  • దాడుల కల్చర్‌ మొదలుపెట్టిందే బీఆర్‌ఎస్‌

  • కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, అడ్డగుట్ట, మే 7(ఆంధ్రజ్యోతి): దాడుల సంప్రదాయం గురించి మాట్లాడ్డానికి బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సిగ్గుండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. ‘దాడుల కల్చర్‌ను మొదలుపెట్టిందే బీఆర్‌ఎస్‌. ఆ పార్టీ రాచరిక పాలనలో.. కేటీఆర్‌ సిరిసిల్లకు వెళ్లినప్పుడు బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలను గృహ నిర్బంధం చేసేవారు. ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అర్ధరాత్రి పంట చేలల్లో నుంచి వచ్చి కర్రలతో మాపై దాడులు చేశారు. ఆ దాడుల్లో మా పార్టీ కార్యకర్తలు ఆరుగురి తలలకు గాయాలయ్యాయి. మరో ముగ్గురికి కాళ్లు విరిగాయి. ఒక్కరోజే 18 వాహనాలు ధ్వంసం చేశారు. మహిళా కార్యకర్తలను ఎత్తుకుపోయి తీవ్రంగా కొట్టారు. ఇవన్నీ మరచిపోతామా? అయినా వాటికి మేం ప్రతీకారం తీర్చుకోవట్లేదు’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ పై దాడి చేయాలనే ఆలోచనే కార్యకర్తలకు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి నోటికొచ్చినట్లు మాట్లాడ్డం కరెక్ట్‌ కాదన్నారు. దాడులను తాము సమర్థించట్లేదని.. కానీ, తమ కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దుంటుందని.. దానిని పిరికితనంగా భావించవద్దని సంజయ్‌ స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉండాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు.

Updated Date - May 08 , 2026 | 06:37 AM