కాంగ్రెస్ డైరెక్షన్.. బీఆర్‌ఎస్ యాక్షన్
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:49 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్ర ప్రజలకు ‘రక్త కన్నీరు-2’ సినిమా చూపిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్ డైరెక్షన్.. బీఆర్‌ఎస్ యాక్షన్ మూవీ..
ప్రజలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ‘రక్త కన్నీరు-2’ సినిమా చూపిస్తున్నాయి
బీఆర్‌ఎస్ పాపాలను రేవంత్ మోయడంలో మతలబు ఏంటి?
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జూలై 12(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్ర ప్రజలకు ‘రక్త కన్నీరు-2’ సినిమా చూపిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్ డైరెక్షన్.. బీఆర్‌ఎస్ యాక్షన్ మూవీ.. రక్త కన్నీరు-2. ‘రక్త కన్నీరు’ నాగభూషణంను మించి నటనలో జీవిస్తున్నార’ని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ కాళేశ్వరాన్ని కూల్చి రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేస్తే.. ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరాన్ని కోమాలోకి నెట్టిందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాపాలకు తెలంగాణ రైతులు బలవుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ చేతకానితనాన్ని ఎన్డీఎస్ఏపై నెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘ఆనకట్టల భద్రతా చట్టం-2021 ప్రకారం బ్యారేజీల యజమాని తెలంగాణ ప్రభుత్వమే. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ కమిటీలు సాంకేతిక సలహాలు మాత్రమే ఇస్తాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. బ్యారేజీ మరమ్మతు పనులు చేయాల్సింది.. బాధ్యత వహించాల్సింది కూడా ప్రభుత్వమే’నని పేర్కొన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎ్‌సఏ మూడుసార్లు నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని పదే పదే చెప్పినా ఎందుకు పెడచెవిన పెడుతున్నారని ప్రశ్నించారు.
‘కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, బాధ్యులను జైల్లో వేస్తామని గతంలో ప్రకటించింది కాంగ్రెస్సే. అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరపకుండా రూ.9 వేల కోట్ల అవినీతిపై విచారణకే పరిమితమైంది నిజం కాదా? ఆ కేసులో సూత్రధారులను అరెస్ట్ చేసి జైల్లో వేయకుండా సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కేంద్రంపై రుద్ది తప్పుకొన్నది నిజం కాదా? విజిలెన్స్ నివేదికను బయటపెట్టే దమ్ముందా?’ అని సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ పాపాలను సీఎం రేవంత్ రెడ్డి మోయడం వెనక మతలబు ఏమిటని సంజయ్ నిలదీశారు. కాళేశ్వరం మరమ్మతుల విషయంలో రెండున్నరేళ్లు జాప్యం చేసి.. ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంటే చర్చను దారి మళ్లించేందుకు ఎన్డీఎస్ఏకు అప్పగిస్తామంటూ కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల అవినీతి, నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల గోదావరి జలాలను తెలంగాణ ప్రజలు వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు పక్కనపెట్టాలని సూచించారు.
రేవంత్‌కు చంద్రబాబు ఏబీసీడీలు నేర్పించలే
జగిత్యాల: రేవంత్‌రెడ్డికి గతంలో చంద్రబాబు ఏబీసీడీలు నేర్పలేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. రేవంత్‌కు చదువు, సంస్కారం లేదని, ఏదో యూనివర్సిటీకి వెళ్లి ఏబీసీడీలు నేర్చుకుంటున్నారని విమర్శించారు. జగిత్యాలలో అర్వింద్ మాట్లాడుతూ సీఎంకు ఏ ప్రభుత్వ శాఖ మీద సరైన అవగాహన లేదన్నారు.