Share News

పార్టీకి తలవంపులు తేను

ABN , Publish Date - May 11 , 2026 | 05:59 AM

పార్టీ, కార్యకర్తలు తలవంచుకునే పని తాను ఏనాడూ చేయనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. జై శ్రీరామ్‌, భారత్‌ మాతాకీ జై అంటూ పార్టీ తలెత్తుకునేలా

పార్టీకి తలవంపులు తేను

  • రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు కుట్ర చేస్తున్నారు

  • భయపడేందుకు ఫాంహౌస్‌లో ఎలుకను కాదు: బండి సంజయ్‌

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): పార్టీ, కార్యకర్తలు తలవంచుకునే పని తాను ఏనాడూ చేయనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. జై శ్రీరామ్‌, భారత్‌ మాతాకీ జై అంటూ పార్టీ తలెత్తుకునేలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు. ఆదివారం పరేడ్‌ గ్రౌండ్‌లో చేపట్టిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘నన్ను రాజకీయంగా ఎదుర్కొనడం చేతగాని మూర్ఖులు.. ఏదో చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, నేను ఫాంహౌస్‌లో ఎలుకను కాదు. నాపై కుట్రలు చేస్తే భయపడను. నేను నా అయ్యపేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదు. నా తాత పేరు చెప్పి రాలేదు. కమలం జెండాను పట్టుకొని కిందిస్థాయి నుంచి ఎదిగిన కార్యకర్తను. నరేంద్రమోదీ శిష్యునిగా క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేస్తున్నాను. బీజేపీకి తలవంపులు తెచ్చే పని చేయను. తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మకండి’’ అని బండి సంజయ్‌ అన్నారు. జై శ్రీరామ్‌ అంటే కడుపు నిండుతుందా అని, పైసలు పడతయా అని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని, అయితే పశ్చిమ బెంగాల్‌, అసోంలో గెలుపుతో ఆ నినాదం వారిని భయపెడుతోందని తెలిపారు. జై శ్రీరామ్‌ నినాదమే గడీలను బద్దలు కొట్టి కేసీఆర్‌ను ఫాంహౌస్‌ కు పరిమితం చేసిందన్న విషయాన్ని ఆయన కుటుంబం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని హేళన చేస్తే ఊరుకునేది లేదని, 80 శాతం హిందువుల కోసం బీజేపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. తాము ఒక వర్గానికి కొమ్ము కాయమని, ఒక వర్గాన్ని కించపరచబోమని చెప్పారు. ‘‘మేం అల్లాను కించ పరచలేదు.


ఏసు ప్రభువును కించపరచలేదు. మా రాముడిని, భగవంతుణ్ణి కించపరిస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని సంజయ్‌ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇస్తున్న నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని, లేదంటే కాంగ్రెస్‌ పాలన సాగించే పరిస్థితే లేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు ఆ సొమ్మును ఢిల్లీకి పంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడంతో రాహుల్‌, ప్రియాంక ముఖం చెల్లక.. తెలంగాణవైపు తిరిగి చూడటంలేదన్నారు.

Updated Date - May 11 , 2026 | 06:00 AM