Share News

రేవంత్‌ ఆటకు ముగింపు పలుకుతా

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:23 AM

కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మెజారిటీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు దక్కకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...

రేవంత్‌ ఆటకు ముగింపు పలుకుతా

  • కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌, ఎంఐఎంతో కలిసి కుట్రలు చేసిన సీఎం, మంత్రులు

  • రాష్ట్రంలో అధికార మార్పిడి కరీంనగర్‌ నుంచే మొదలు: సంజయ్‌

కరీంనగర్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మెజారిటీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు దక్కకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక కుట్రలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎంతో కలిసి సీఎం, మంత్రులు కుట్రలకు పాల్పడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి మొదలుపెట్టిన ఆటకు తాను ముగింపు పలుకుతానని హెచ్చరించారు. సోమవారం కరీంనగర్‌ నగర మేయర్‌ ఎన్నిక అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘మీరు అనవసరంగా, అప్రజాస్వామికంగా.. నన్ను కెలికి ఆట మొదలుపెట్టారు. ఇక మీ ఆటకు నేను ముగింపు పలుకుతాను’’ అని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు ఒక్కటి కావడానికి కారణమేంటని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫాంహౌస్‌ వేదికగా కుట్రలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. వారి కుట్రలను చూసి ప్రజలు విస్తుపోయారని, ఈ కుట్రలో ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి కూడా భాగస్వామి కావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, కరీంనగర్‌ నుంచే ఆ మార్పు మొదలైందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పతనానికి నాంది పలుకుతామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేసేలా పోరాడతామని ప్రకటించారు. కరీంనగర్‌లో తమ గెలుపునకు ప్రధాని మోదీఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారం కారణమన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 07:24 AM