ఫామ్‌హౌస్‌లో బండి భగీరథ్ విచారణ
ABN , Publish Date - May 28 , 2026 | 03:50 AM
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను మేడ్చల్ జిల్లా న్యాయస్థానం మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించటంతో..
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్.. జైలు నుంచి బుధవారం కస్టడీకి తీసుకున్న పోలీసులు
వైద్య పరీక్షల అనంతరం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు..
డీసీపీ కార్యాలయంలో డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో విచారణ
నేడు భగీరథ్ స్నేహితుల సమక్షంలో మరోసారి విచారణ
ఒక అపార్ట్‌మెంట్‌లోనూ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం
హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్/మొయినాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను మేడ్చల్ జిల్లా న్యాయస్థానం మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించటంతో.. పేట్ బషీరాబాద్ పోలీసులు అతడిని బుధవారం చర్లపల్లి జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు జైలు లోపలికి వెళ్లిన పోలీసులు మధ్యాహ్నం 1 గంటకు భగీరథ్‌ను తీసుకొని బయటకు వచ్చారు. అనంతరం మేడ్చల్ జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి.. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కూకట్‌పల్లి డీసీపీ కార్యాలయానికి తరలించి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో విచారించారు.
ఫామ్‌హౌజ్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్..
పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కొంతసేపు విచారణ అనంతరం భగీరథ్‌ను మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌజ్‌కు తీసుకెళ్లారు. అక్కడకు బాధిత బాలికను ఎన్నిసార్లు తీసుకెళ్లారు..? ఎన్ని రోజులు ఉన్నారు..? ఏ గదుల్లో ఉన్నారు..? ఎవరెవరితో కలిసి వచ్చారు? అసలు అక్కడ బాలికకు, భగీరథ్‌కు మధ్య ఏం జరిగింది..? అనే అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఫామ్‌హౌజ్‌లో జరిగిన మొత్తం ఎపిసోడ్‌పై సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసి, పలు అధారాలు సేకరించినట్లు తెలిసింది. అతడిని ఫామ్‌హౌ్‌సకు తీసుకెళ్తున్న విషయాన్ని మీడియాతోపాటు స్థానిక పోలీసులకు కూడా సిట్ అధికారులు తెలియనివ్వలేదు.
ఈ కేసులో బండి భగీరథ్ స్నేహితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు ఇదివరకే ప్రశ్నించారు. నేడు మరోసారి వారిని, బాధితురాలిని పిలిచి విడివిడిగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భగీరథ్ స్నేహితుల స్టేట్‌మెంట్ రికార్డు ఆధారంగా అతడిని ప్రశ్నించే అవకాశం ఉంది. బాధితురాలికి భగీరథ్‌కు మధ్య జరిగిన వాట్సాప్, స్నాప్‌చాట్ సంభాషణలు, ఫోన్‌కాల్ రికార్టుల వంటి టెక్నికల్ ఆధారాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా నేడు నానక్‌రామ్‌గూడలోని ఓ అపార్టుమెంట్‌లో భగీరథ్, అతడి స్నేహితుల సమక్షంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.