రెండో రోజు కొనసాగిన బండి భగీరథ్ విచారణ
ABN , Publish Date - May 29 , 2026 | 03:19 AM
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు రెండో రోజు విచారణ కొనసాగించారు.
హైదరాబాద్ సిటీ, మే 28 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు రెండో రోజు విచారణ కొనసాగించారు. డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌ను ప్రశ్నించి పలు సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. మొదటి రోజు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. రెండో రోజు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించినట్లు సమాచారం. బాధితురాలి తల్లి పోలీసులకు సమర్పించిన కాల్ రికార్డులు, వాట్సాప్, స్నాప్‌చాట్ చాటింగ్‌లపై పలు ప్రశ్నలు అడగగా.. వాటికి భగీరథ్ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. కాగా, బండి భగీరథ్ పోలీస్ కస్టడీ శుక్రవారంతో ముగుస్తుండటంతో.. మూడు రోజులు జరిపిన విచారణ, సేకరించిన ఆధారాల నివేదికను న్యాయస్థానంలో సమర్పించి, భగీరథ్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో తిరిగి చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.