బండి భగీరథ్‌కు బెయిల్
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:42 AM
పోక్సో కేసులో నమోదైన ఆరోపణల నేపథ్యంలో జైలులో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజ య్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు హైకోర్టు గురువారం పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
షరతులతో మంజూరు చేసిన హైకోర్టు
ప్రతి వారం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలి
బాధితురాలిని, సాక్షులను సంప్రదించవద్దు
మీడియాతో మాట్లాడొద్దు.. పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలి: న్యాయస్థానం
పోక్సో కేసులో 55 రోజులు జైలులో భగీరథ్
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో నమోదైన ఆరోపణల నేపథ్యంలో జైలులో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజ య్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు హైకోర్టు గురువారం పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు భగీరథ్ 55 రోజులుగా జైల్లో ఉండటం, ఇప్పటికే 25 మంది సాక్షుల విచారణ జరగటం, దర్యాప్తు సైతం దాదాపు పూర్తి అయిన నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ కే సుజన ధర్మాసనం బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే ఫిర్యాదుదారుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని కఠిన షరతులు విధిస్తున్నట్లు తెలిపింది. ‘పిటిషనర్ రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌తోపాటు ట్రయల్ కోర్టు నిర్ణయం మేరకు రెండు పూచీకత్తులు సమర్పించాలి. 8 వారాల వరకు లేదా చార్జిషీటు దాఖలయ్యే వరకు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలి. ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగానీ బాధితురాలు, ఫిర్యాదుదారు, సాక్షులతో ఎలాంటి సంప్రదింపులు జరపరాదు. బాధితురాలికి సంబంధించిన ఇల్లు, పరిసరాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రదేశాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. బెదిరింపులు, కఠినంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడవద్దు. మీడియా, సోషల్‌మీడియాలో ప్రస్తుత నేరం లేదా ఇతర అంశాల గురించి మాట్లాడరాదు. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదు. పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలి. ఈ షరతులను భగీరథ్ ఉల్లంఘిస్తే ఫిర్యాదుదారులు బెయిల్ రద్దును కోరవచ్చు’ అని హైకోర్టు స్పష్టం చేసింది.