బండి భగీరథ్ కేసులో కీలకంగా స్నేహితుల వాంగ్మూలం
ABN , Publish Date - May 19 , 2026 | 04:37 AM
బండి భగీరథ్ కేసులో.. అతడి స్నేహితుల వాంగ్మూలాలు కీలకంగా మారనున్నట్టు తెలిసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న మేరకు..
వారిచ్చిన వివరాల ఆధారంగా కేసులో మరో సెక్షన్ జోడింపు
సోషల్ మీడియా డేటా వెలికితీత
సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సేకరణ
హైదరాబాద్ సిటీ, మే 18(ఆంధ్రజ్యోతి): బండి భగీరథ్ కేసులో.. అతడి స్నేహితుల వాంగ్మూలాలు కీలకంగా మారనున్నట్టు తెలిసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న మేరకు.. భగీరథ్ స్నేహితులకు సంబంధించిన వివరాలు, వారికి సహకరించిన వారి వివరాలతోపాటు, ఈ వ్యవహారంలో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారు? ఎవరి ప్రమేయం ఎంత ఉంది? అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భగీరథ్ స్నేహితులు ముగ్గురు అమ్మాయిలు సహా.. సుమారు పదిమంది వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసినట్టు సమాచారం. ఆ వాంగ్ములాలన్నీ కేసు విచారణలో కీలకం కానున్నాయి. కాగా.. భగీరథ్ స్నేహితులను విచారించిన పోలీసులు.. నిందితుడు బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఈ కేసులో మరో సెక్షన్ (బీఎన్‌ఎ్‌స 64(2)(ఎం)) నమోదు చేసినట్లు తెలిసింది. ఈ సెక్షన్ ప్రకారం.. నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. భగీరథ్‌కు తన కుమార్తెతో నిరుడు జూన్‌లో పరిచయమైందని.. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ల ద్వారా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. వారిద్దరి ఇన్‌స్టా, స్నాప్‌చాట్ ఖాతాల్లోని డేటాను రిట్రీవ్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భగీరథ్ మొబైల్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు.. కాల్‌రికార్డులు, వాట్సాప్ చాట్‌లతో పాటు సోషల్ మీడియా డేటాను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే.. స్నేహితుల సహకారంతో భగీరథ్ తన కుమార్తెను నిరుడు అక్టోబరు 25న నానక్‌రామ్‌గూడలోని ఒక అపార్టుమెంట్‌కు, నవంబర్-13న మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌజ్‌కు, డిసెంబర్-31న మరోసారి మొయినాబాద్‌లోని మరో ఫామ్‌హౌజ్‌కు తీసుకెళ్లి మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి పేర్కొనడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయా తేదీల్లో అక్కడి ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న సీసీటీవీ పుటేజీలతో పాటు.. ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి, న్యాయస్థానం అనుమతితో నిందితుణ్ని పోలీస్ కస్టడీకి తీసుకొని.. తాము సేకరించిన ఆధారాలను ముందుపెట్టి లోతుగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.