గిరిజనుల సమస్యలపై గవర్నర్‌కు దత్తాత్రేయ వినతి
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:54 AM
రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు...
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి గిరిజనుల సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. గిరిజనుల భూ హక్కుల పరిరక్షణ, పోడు వ్యవసాయ సమస్యల పరిష్కారం, 1/70చట్టం సమర్థ అమలు, పెసా(పీఈఎ్‌సఏ) చట్టం అమలు, అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనులకు హక్కుల కల్పన వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలని, గిరిజన ప్రాంతాల్లో భూఆక్రమణలు, అభివృద్ధి లోపం, ఉపాధి అవకాశాల కొరత వంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర గిరిజన సలహా మండలి ద్వారా తగిన చర్యలు చేపట్టాలని దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. గిరిజనుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి సాధ్యమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.