అక్రమ కేసులకు భయపడను
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:22 AM
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
ఆదిలాబాద్ జైలు నుంచి విడుదల
హైదరాబాద్/ఆదిలాబాద్/రామకృష్ణాపూర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి ఘటనలో అరెస్టయిన ఆయన, 16 రోజుల జైలు శిక్ష అనంతరం బుధవారం ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడారు. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో ప్రజలు బీఆర్‌ఎ్‌స-సీపీఐ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని, 22 వార్డులకు గాను తమ కూటమి 14 చోట్ల విజయం సాధించిందని గుర్తుచేశారు. 7 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ, మంత్రి వివేక్ అండతో చైర్మన్ పదవి కోసం దౌర్జన్యం చేసిందని ఆరోపించారు. తమ కౌన్సిలర్లను భద్రాచలంలో పోలీసులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, చైర్మన్ ఎన్నికను అడ్డుకుని అన్యాయానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు బనాయించి, ఇన్ని రోజులు బెయిల్ రాకుండా అడ్డుకున్నారని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బాల్క సుమన్‌పై నమోదైన పలు కేసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై చెన్నూరులో నమోదైన కేసు (ఎఫ్‌ఐఆర్ 37), రాయదుర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో వేర్వేరు క్వాష్ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.సుజన ధర్మాసనం.. పూర్తి వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఫిర్యాదుదారులకు, పోలీసులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.