సింగరేణి ఆఫీసులు కాలబెట్టండి
ABN , Publish Date - May 27 , 2026 | 04:42 AM
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం, ధర్నాలకు పిలుపునిస్తే రైతులు రావటం లేదని, నలుగురైదుగురు రైతులు వస్తే మనోళ్లే....
రైలు పట్టాలు కోసేయండి!
మిలిటెంట్ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయండి
ముందు కాలబెట్టు.. పైసలెవడు ఇవ్వడో చూద్దాం
ధర్నాలకు రైతులు వస్తలేరు, మనోళ్లే వస్తున్నారు
బీఆర్‌ఎస్ కార్యక్రమంలో బాల్క సుమన్ వ్యాఖ్యలు
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం, ధర్నాలకు పిలుపునిస్తే రైతులు రావటం లేదని, నలుగురైదుగురు రైతులు వస్తే మనోళ్లే(బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు) 100 మంది వస్తున్నారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. ఉద్యమం ఉధృతం కావాలంటే మిలిటెంట్ తరహా కార్యకలాపాలు చేపట్టాలని, సింగరేణి కార్యాలయాలు కాలబెట్టాలని, రైలు పట్టాలు కోసేయాలని పిలుపునిచ్చారు. ముచ్చట్లు, సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారం, ప్రెస్‌మీట్లు చెప్పుడు కాదని సీరియ్‌సగా మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని సూచించారు. అవసరమైతే 3 నెలలు జైలుకైనా పోయొద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సింగరేణి కార్మిక సంఘాల నేతలు, కార్మికులను ఉద్దేశించి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు. ‘‘ధర్నాలకు పిలుపునిస్తే రైతులు రోడ్ల మీదికి రావటంలేదు. నిన్న చెన్నూరు నియోజకవర్గంలోని భీమారంలో జాతీయ రహదారిని మావోళ్లు(బీఆర్‌ఎస్) దిగ్బంధించారు. ఐదుగురే రైతులు వచ్చారు. 60-70 మంది మనోళ్లే ఉన్నారు. చెన్నూరు సమీపంలోని కిష్టంపేటలో జాతీయ రహదారిపై కూర్చుంటే నలుగురైదుగురే రైతులు వచ్చిండ్లు. 100 మంది మనోళ్లే(బీఆర్‌ఎస్) ఉన్నారు. రైతులు ఎవరూ రావటంలేదు’’ అంటూ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ‘‘మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు చెప్పుడు కాదు... మీటింగులు పెట్టుడు కాదు! సోషల్ మీడియాల ప్రచారం చేసుడు కాదు.. ప్రెస్‌మీట్లు పెట్టుడు కాదు.. మందమర్రి ఏరియాలో మీటింగ్ పెట్టండి. జీఎం ఆఫీసు కాలబెడదాం! పోతే పోయొద్దాం 3 నెలలు జైలుకు! కాబట్టి మిలిటెంటు యాక్టివిటీ కూడా మీరు సీరియ్‌సగా ప్లాన్ చేయాలి. అవసరమైతే ఒకరోజు ఇక్కడి సింగరేణి భవన్‌కు రండి! కాలబెట్టండి! అంగడి అంగడిచేసి పారేయండి. నేను చెప్పేది సీరియ్‌సగా తీసుకోవాలి. మన నాయకత్వం మీద, సంఘం మీద ప్రతి ఒక్కరికి ఫీలింగ్ రావాలి. ఓనర్‌షిప్ రావాలి. కావున మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి. మన ఏరియాలో చాలా రైల్వే లైన్లు ఉన్నాయి. కోసి పారేయండి. ఓ రోజు రైల్ రోకో అని ప్రోగ్రాం పెట్టి(పట్టాలు) కోసిపారేయండి’’ అని పిలుపునిచ్చారు. ఇవన్నీ చేయాలంటే పైసలు కావాలని ఓ కార్మికుడు చెప్పగా, ‘‘పైసలా? నువ్ కాలబెట్టు! పైసలు తండోపతండాలుగా వస్తాయి. ఒక్కటి కాలబెట్టు పైసలు ఎవడియ్యడో చూద్దాం’’ అన్నారు. బాల్క సుమన్ ఉపన్యాసాన్ని బీఆర్‌ఎస్ యూట్యూబ్ లైవ్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలను గ్రహించిన సోషల్ మీడియా టీమ్ సదరు కంటెంట్‌ను లైవ్ ఫీడ్ నుంచి తొలగించింది. కానీ అప్పటికే సుమన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక నిమిషం నిడివితో ఉన్న వీడియో క్లిప్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.