Share News

బాల్క సుమన్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:19 AM

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బాల్క సుమన్‌ అరెస్ట్‌

  • 14 రోజుల రిమాండ్‌, ఆదిలాబాద్‌ జైలుకు బీఆర్‌ఎస్‌ నేత తరలింపు

  • క్యాతన్‌పల్లిలో ఉద్రిక్తత, 19 మంది అరెస్ట్‌

  • అప్రజాస్వామికమన్న హరీశ్‌రావు, కేటీఆర్‌

రామకృష్ణాపూర్‌, హైదరాబాద్‌, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్యాతన్‌పల్లిలోని సుమన్‌ ఇంటికి చేరుకున్న పోలీసులను బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను నిలువరిస్తూనే సుమన్‌ నివాసంలోకి వెళ్లిన పోలీసులు అయనను అరెస్ట్‌ చేసి వైద్య పరీక్షల నిమిత్తం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల సందర్భంగా ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్‌, ఎంపీ వంశీ కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు బాల్క సుమన్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మంత్రి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎస్‌ఐ గంగారాం, కానిస్టేబుల్‌ నరేశ్‌, కాంగ్రెస్‌ నాయకులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సుమన్‌ను అరెస్ట్‌ చేసి మంచిర్యాల కోర్టుకు తరలించారు. సుమన్‌కు మంచిర్యాల ఫస్ట్‌ క్లాస్‌ అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి 14రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించారు. అనంతరం సుమన్‌ను ఆదిలాబాద్‌ జైలుకు తరలించారు. మరోవైపు పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చేపట్టి గురువారం మంచిర్యాల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు 19 మందిని అరెస్టు చేశారు.

పిరికిపంద చర్య: కేటీఆర్‌, హరీశ్‌రావు

దళిత నాయకుడిని ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్‌ సర్కార్‌ పిరికిపంద చర్యకు నిదర్శమని బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు విమర్శించారు. క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక్‌ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్‌ అధికారులు, పోలీసులు... కాంగ్రెస్‌ నాయకులకు తలొగ్గి పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పతనానికి నిదర్శనమన్నారు. ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును అపహాస్యం చేస్తూ అభ్యర్థులను కిడ్నాప్‌ చేయడం, అడ్డుకున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. మంత్రి వివేక్‌ చేస్తున్న అరాచకాలను, ఎన్నికల అక్రమాలను ప్రశ్నించినందుకే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని కేటీఆర్‌, హరీశ్‌రావు ఆరోపించారు. మరోవైపు బాల్క సుమన్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 19 , 2026 | 05:19 AM