Share News

బాల్క సుమన్‌ అరెస్టు

ABN , Publish Date - May 31 , 2026 | 05:14 AM

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్కసుమన్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బాల్క సుమన్‌ అరెస్టు

  • ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలంటూ చేసిన వ్యాఖ్యల కేసులో అదుపులోకి

  • నాంపల్లి పోలీసుస్టేషన్‌ వద్దకు భారీగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు

  • స్టేషన్‌ ద్వారానికి తాళం వేసిన పోలీసులు

  • రాత్రి సమయంలో న్యాయమూర్తి నివాసానికి సుమన్‌ను తీసుకెళ్లిన పోలీసులు

  • 14 రోజుల రిమాండ్‌కు జడ్జి ఆదేశం

అఫ్జల్‌గంజ్‌, హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్కసుమన్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నాంపల్లిలోని సింగరేణి భవన్‌ ఎస్‌ అండ్‌ పీసీ విభాగం జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.ఆనంద్‌ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు.. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ వద్ద బాల్క సుమన్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సుమన్‌ అరెస్టు వార్త తెలుసుకొని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, సుమన్‌ అనుచరులు పెద్ద సంఖ్యలో నాంపల్లి పోలీస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్టేషన్‌ చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇతరులు పోలీసుస్టేషన్‌లోకి రాకుండా ప్రధాన ద్వారానికి తాళం కూడా వేశారు. పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు, బాల్క సుమన్‌ అనుచరులను పోలీసులు అక్కడ నుంచి చెదరగొట్టారు. అనంతరం శనివారం రాత్రి సమయంలో బాల్క సుమన్‌ను హిమాయత్‌నగర్‌లోని న్యాయమూర్తి ఇంటి వద్దకు నాంపల్లి పోలీసులు తీసుకెళ్లారు. అయితే, ఎలాంటి అనుమతి లేకుండా బాల్క సుమన్‌ను తమ అపార్ట్‌మెంట్‌లోకి తీసుకొచ్చిన పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనుమతించే వరకు బయట వేచి చూడాలని ఆదేశించారు. దీంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది, బాల్కసుమన్‌ అభిమానులు, న్యాయవాదులు న్యాయమూర్తి ఆదేశాల కోసం రాత్రి 11.20 గంటల వరకు బయటే వేచి ఉన్నారు. కాగా సుమన్‌ను 14 రోజుల రిమాండ్‌ కు తరలించాలని అర్ధరాత్రి తర్వాత జడ్జి ఆదేశించారు. కాగా, సింగరేణి కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయాలని రెచ్చగొట్టే ప్రసంగం చేసిన కేసులో బాల్క సుమన్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు కాలం చెల్లిపోయింది. ముందస్తు బెయిల్‌ కోసం సుమన్‌ హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈలోగా పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్ట్‌ చేయడంతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు కాలం చెల్లిపోయింది. ఇప్పటికే అరెస్ట్‌ జరిగిన నేపథ్యంలో సుమన్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - May 31 , 2026 | 05:14 AM