బలిమెల బాధిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:45 AM
ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో 2008 జూన్ 29న మావోయిస్టుల అకస్మిక దాడిలో మరణించిన పోలీసు కుటుంబాలకు 18 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది.
33 మంది కుటుంబాలకు పట్టాల పంపిణీ
18 ఏళ్లకు పోలీసు కుటుంబాలకు న్యాయం:డీజీపీ
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో 2008 జూన్ 29న మావోయిస్టుల అకస్మిక దాడిలో మరణించిన పోలీసు కుటుంబాలకు 18 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. ఈ విషాద ఘటనలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎస్‌ఐబీ డీఐజీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 2 నెలలకే జరిగిన బలిమెల దుర్ఘటన ఇప్పటికీ తనను చేదు జ్ఞాపకంగానే వెంటాడుతోందన్నారు. విధి నిర్వహణలో మరణించిన అమర వీరుల కుటుంబాలను అక్కున చేర్చుకునే లక్ష్యంతో సుదీర్ఘకాలంగా హైదరాబాద్‌శివారుల్లో భూమి కేటాయింపునకు ప్రయత్నాలు కొనసాగాయని ఆయన చెప్పారు. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమరవీరుల వారసులకు అండగా నిలవాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే ఈ సమస్య పరిష్కారమైందని శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. అమరుల కుటుంబాల చిరకాల వాంఛ నెరవేర్చిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 33మంది బాధిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందజేశారు. 2008 జూన్ 29న మావోయిస్టుల అకస్మిక దాడిలో 32మంది గ్రేహౌండ్స్ జవాన్లతోపాటు 38మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా, బాధ్యతాయుతంగా డిజిటల్ సేవల వినియోగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని మహిళా జర్నలిస్టులకు డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ‘హ్యాష్‌టాగ్ ఆన్‌లైన్ బట్ అన్‌అఫ్రైడ్’ అనే నినాదంపై మహిళా జర్నలిస్టులకు సైబర్ సెక్యూరిటీపై అవగాహనా సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరమన్న డీజీపీ.. వాటిని వెంటనే రిపోర్టు చేయడంతో నష్ట నివారణ చేయొచ్చన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాలపై 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.