ఆ 26 ఎకరాలపై బలవంతపు చర్యలొద్దు!
ABN , Publish Date - Jul 21 , 2026 | 05:03 AM
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామం సర్వే నెంబర్ 3, 5 లలో ఉన్న 26 ఎకరాల భూమిపై ఎలాంటి బలవంతపు(కొయెర్సివ్) చర్యలు తీసుకోరాదని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
బహదూర్‌గూడ సర్వే నంబర్ 3, 5 లోని భూములపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
తమ భూముల్లో హైడ్రా కంచె వేసిందన్న పిటిషనర్లు
వాళ్ల దగ్గర సరైన పత్రాలు లేవన్న ఏజీ
విచారణ వారం రోజులపాటు వాయిదా
బుల్లెట్ రైలు భూసేకరణపై 84 మంది పిటిషన్
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామం సర్వే నెంబర్ 3, 5 లలో ఉన్న 26 ఎకరాల భూమిపై ఎలాంటి బలవంతపు(కొయెర్సివ్) చర్యలు తీసుకోరాదని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సేకరించ తలపెట్టిన భూముల సమీపంలోనే ఈ భూమి కూడా ఉంది. ఈ 26 ఎకరాలు ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ హైడ్రా ఫెన్సింగ్ వేసిందంటూ జక్కిడి యాదిరెడ్డి, మరి కొంతమంది వ్యక్తులు హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపించారు. గత 30 ఏళ్లుగా సదరు భూమి తమ ఆధీనంలో ఉందని, రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఆ భూమిని కొనుగోలు చేశామని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నెల 18న హైడ్రా తమ ప్రైవేటు భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా బుల్డోజర్లతో గేటు, ప్రహరీ కూల్చేశారని తెలిపారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారన్నారు. పంటలు సాగు చేసుకోవడానికి వెళ్తుండగా హైడ్రా సిబ్బంది అడ్డుకున్నారని చెప్పారు. హైడ్రాను నిరోధించాలని, పంటల సాగును కొనసాగించడానికి అనుమతించాలని కోరారు.
ప్రభుత్వం తరఫు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వివాదాస్పద 26 ఎకరాల భూమి విషయంలో పిటిషనర్ల యాజమాన్యాన్ని నిరూపించేలా సరైన సేల్ డీడ్స్, పహాణీ, పాస్ పుస్తకాలు, టైటిల్ పత్రాలు ఏవీ లేవని తెలిపారు. బహదూర్‌గూడ గ్రామం సర్వే నెంబర్ 28, 62 తదితరాల్లో దాదాపు 650 వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. ఈ 26 ఎకరాలు కూడా అందులో భాగమేనన్నారు. ప్రస్తుత వివాదంలో ఉన్న భూమి విషయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
మరికొన్ని పిటిషన్లు
బహదూర్‌గూడలోని వివిధ సర్వే నెంబర్లలో ఉన్న తమ భూముల్లోకి హైడ్రా, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ప్రవేశించి విధ్వంసం సృష్టించారని, తమ భూములను రక్షించాలని కోరుతూ, ఆర్.కృష్ణమోహన్‌రాజు మరో 84 మంది రైతులు, భూయజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నెల 18న తెల్లవారుజామున 4 గంటలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, హైడ్రా సిబ్బంది బుల్డోజర్లు, జేసీబీలతో ప్రవేశించి విఽధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా లేదా రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా భూములు కొనుగోలు చేశామని తెలిపారు. ఆ భూముల్లో లక్షల రూపాయలు వెచ్చించి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకొని, పైపులైన్లు వేసి, బోర్‌వెల్స్ వేసి వ్యవసాయం చేస్తున్నామని చెప్పారు. సర్వే నెంబర్ 28, సర్వే నెంబర్ 62లో 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని పేర్కొనడం అసమంజసమన్నారు. ప్రభుత్వ భూములని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ప్రభుత్వం బలవంతపు చర్యలకు దిగడం వల్ల 500 కుటుంబాలు తీవ్రమైన మానసిక వేదన, ఒత్తిడిలో ఉన్నాయని తెలిపారు. కూల్చివేతల సమయంలో కొంతమంది గ్రామస్థులను అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. హైడ్రాను, ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ద్వారా రైతులకు ఉపశమనం కలిగించాలని, అక్రమంగా భూములు ఖాళీ చేయించినందుకు పరిహారం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్లు మంగళవారం జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి.
సర్వే నంబర్ 3, 5లలో బుల్లెట్ రైలు ప్రతిపాదన లేదు
శంషాబాద్ రూరల్: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శంషాబాద్ తహసీల్దార్ అమరలింగంను వివరణ కోరగా జక్కిడి యాదిరెడ్డి, జక్కిడి శ్రీనివా్‌సరెడ్డి, తూర్పు సుదర్శన్‌రెడ్డి, తూర్పు సుధాకర్‌రెడ్డిలకు సర్వే నెంబరు 3, 5లో 28.6 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. వాటిలో హైడ్రా ఫెన్సింగ్ వేస్తున్నట్లు వారు కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ భూములకు బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ఇచ్చిన భూములకు సంబంధం లేదని తహసీల్దార్ చెప్పారు. తాము సర్వే నంబరు 28, 62లలోని ప్రభుత్వ భూములకే ఫెన్సింగ్ వేశామని తెలిపారు. పిటిషనర్లు చెబుతున్న సర్వే నెంబర్ 3, 5 భూములకు తాము ఎక్కడా కంచెవేయలేదని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ భూమి అయిన 650 ఎకరాలకు మాత్రమే ఫెన్సింగ్ చేశామని వెల్లడించారు.