పోలీసుల కళ్లలో కారం చల్లి..
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:13 AM
బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని..
అడుగడుగునా అడ్డుకున్న రైతులు
బహదూర్‌గూడలో భూసేకరణ ఉద్రిక్తం
ఇక్కడ 650 ఎకరాల భూమిని బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
ఫెన్సింగ్ వేసేందుకు రెవెన్యూ సిబ్బంది యత్నం
కారం చల్లి.. కుర్చీలు విసిరిన ఆందోళనకారులు
శంషాబాద్ రూరల్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని ఈ భూములకు ఫెన్సింగ్ వేసేందుకు వెళ్లిన రెవెన్యూ, పోలీసు సిబ్బందిని.. ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులు అడుగడుగునా అడ్డుకున్నారు. కొందరు మహిళలు ఏకంగా పోలీసుల పైకి దూసుకువచ్చి.. వారి కళ్లలో కారం చల్లారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇక్కడ సర్వే నం.28, 60లలోని 650 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. అయితే ఈ భూములను దశాబ్ధాలుగా స్థానిక రైతులు సాగు చేసుకుంటున్నారు. గతంలో ఈ భూములను తమకు ప్రభుత్వం అసైన్ చేసిందని రైతులు చెబుతున్నారు. కానీ, రికార్డుల్లో అసైన్ చేసినట్లు ఆధారాలు గానీ, పాస్‌పుస్తకాలు గానీ రైతుల వద్ద లేవు. దీనిపై వారు అనేకమార్లు అధికారులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారంకాలేదు. ఈ భూ ములను బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు కేటాయిస్తామని, వాటిని ఖాళీ చేయాలని అధికారులు వచ్చి చెప్పినప్పటి నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
ఫెన్సింగ్ మొదలు పెట్టగానే...
భూములను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసేందుకు పోలీసు, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది కలిపి సుమారు 1000 మంది శనివారం ఉదయం 4గంటలకే బహదూర్‌గూడకు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చి వేసి ఫెన్సింగ్ వేస్తుండగా స్థానిక రైతులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అక్కడికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి నందిగామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకున్న సమయంలో కొందరు బీజేపీ నాయకులు వచ్చి ఆందోళనకారులకు మద్దతు పలికారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ కూడా రాగా.. వారిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో టెంట్ వద్ద ఆందోళన చేస్తున్న ఐదుగురు మహిళలు అనూహ్యంగా అక్కడ ఉన్న డీసీపీ యోగేశ్‌గౌతమ్, సీఐ నరేందర్‌రెడ్డి, ఇతర పోలీసుల సిబ్బంది వైపు దూసుకు వచ్చి వారి కళ్లలో కారం చల్లారు. అక్కడ ఉన్న కుర్చీలు విసిరేశారు. దీంతో పోలీసులు, రైతులకు మద్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి కళ్లలో ఎక్కువ కారం పడటంతో ఆయనను అంబులెన్స్‌లోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. కారం చల్లిన వారిలో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారయ్యారు. అనంతరం పోలీసులు వందలాది మంది కార్మికులతో దాదాపు 550 ఎకరాలకు ఫెన్సింగ్ వేశారు. శనివారం 80 శాతం పనులు పూర్తయ్యాయని, ఆదివారం పూర్తిగా ఫెన్సింగ్ వేస్తామని అధికారులు ప్రకటించారు.
అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు
రైతుల ముసుగులో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల డీసీపీ యోగే శ్‌గౌతమ్ హెచ్చరించారు. రైతులు కదా అని ఓపిక పడితే పోలీసులపైనే కారం చల్లారని, దాడి వెనక ఎవరి హస్తం ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిరసన శాంతియుతంగా ఉండాలని, అవసరమైతే రెవెన్యూ అధికారులతో చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే ఎకరం భూమికి బదులుగా ప్రభుత్వం 500 గజాల స్థలం ఇస్తే తామెలా బతకాలని రైతులు ప్రశ్నించారు. ఎకరానికి బదులు 1200 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో లేదా తహసీల్దార్ స్పష్టమైన హామీ ఇస్తే అందోళన విరమిస్తామన్నారు. కాగా.. బహదూర్‌గూడలోని ఈ అసైన్డ్ భూముల్లో కొన్ని.. వ్యాపారులు, బడా వ్యక్తుల చేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇపుడు ఇక్కడ భూసేకరణ ఉద్రిక్తంగా మారడానికి ఈ బయట వ్యక్తులే కారణమని, వారే తెర వెనుక ఉండి అంతా నడిపిస్తున్నారనే కోణంలో విచారిస్తున్నారు.