పెళ్లి పెట్టిన చిచ్చు!
ABN , Publish Date - May 19 , 2026 | 04:48 AM
పెళ్లయి పది రోజులైంది! తన భార్య బంగారు నగలు, డబ్బుతో మిస్సయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశా డు. తన తండ్రి, పినతల్లి కలిసి డబ్బు కోసం తనను అతనికి అమ్మేశారని భార్య...
భార్యాభర్తల పరస్పర ఫిర్యాదులు
నగలు, డబ్బుతో మిస్సయిందని భర్త ఫిర్యాదు
తన తండ్రి, పినతల్లి అతనికి అమ్మేశారని,ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని భార్య ఆవేదన
న్యాయం చేయాలని మహిళా కమిషన్‌కు వినతి
బచ్చన్నపేట, మే 18 (ఆంధ్రజ్యోతి): పెళ్లయి పది రోజులైంది! తన భార్య బంగారు నగలు, డబ్బుతో మిస్సయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశా డు. తన తండ్రి, పినతల్లి కలిసి డబ్బు కోసం తనను అతనికి అమ్మేశారని భార్య మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది! ఇక్కడ ఆ యువతి వయసు 19 ఏళ్లు. యువకుడి వయసు 45 ఏళ్లని యువతి చెబుతోంది.. 34 ఏళ్లని యువకుడు చెబుతున్నాడు. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కక్కెర్ల రాకేశ్ కూతురు లహరి గౌడ్ (19). జనగామ మండలం పెంబర్తికి చెందిన బీఆర్‌ఎస్ వార్డు సభ్యుడు ఆవుల ప్రశాంత్‌రెడ్డి. స్థానిక సామాజిక కారణాల కారణంగా ఈనెల 8న జీడికల్ ఆలయంలో వీరిద్దరికీ కులాంతర వివాహం జరిపించారు. పెళ్లయిన మర్నాడే.. అంటే 9న లహరి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో, బంగారు నగలు, డబ్బుతో తన భార్య మిస్సయినట్టు భర్త ప్రశాంత్‌రెడ్డి జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, ఈనెల 17వ తేదీ ఆదివారం ఆమె హైదరాబాద్‌లో మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. ప్రశాంత్ రెడ్డి ఇచ్చే రూ.20 లక్షల డబ్బుకు ఆశపడి తన తండ్రి, పినతల్లి అమ్మేశారని వాపోయింది. ప్రశాంత్ రెడ్డి వయస్సు 45 ఏళ్లు ఉంటుందని, ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. తనకు న్యాయం చేయాలని మహిళా కమిషన్‌ను వేడుకుంది. వెరసి, పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతుండగానే, మహిళా కమిషన్‌లో యువతి ఫిర్యాదు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. కాగా, లహరికి గత నవంబరులో వేరే వ్యక్తితో కులాంతర వివాహం జరిగే సమయంలో ఆ కుర్రాడు మైనరంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరిపి వివాహాన్ని నిలిపివేశారు.